Wednesday, June 1, 2011

ఎటుపోతోంది ఈ సభ్య సమాజం...! ?


వరంగల్,జూన్ 1: సభ్య సమాజం తలదించుకునే  ఘటనలు ఈ ఆధునిక యుగంలో కూడా చోటు చేసుకుంటుం డడం మన దౌర్భాగ్యం. వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలం రఘునాథపల్లి గ్రామంలో జరిగిన  ఘటన ఇందుకు నిదర్శనం. పట్టపగలు  ఎవరూ లేని సమయంలో ఒక ఇంట్లో చొరబడిన ఓ కీచకుడు  విద్యార్థిని పై అత్యాచారానికి యత్నించాడు. ప్రతిఘటించిన విద్యార్థిని తలపై సుత్తితో కొట్టి.. హత్యాయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు  పోలీసులు అక్కడికి చేరుకున్నప్పటికీ  ఆగ్రహం చల్లారక  పోలీసుల ముందే  అతడిని సజీవ దహనం చేశారు. కామాంధుడి  దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నింస్ లో చికిత్స పొందుతోంది. రఘునాథపల్లికి చెందిన  మౌనిక (18) హన్మకొండ పింగిళి ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్దనే ఉంటోంది. మంగళవారం ఉదయం ఉపాధి పనుల కోసం తల్లి బయటకు వెళ్లగా.. తండ్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. వీరి ఇల్లు గ్రామం చివరన ఉంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో వర్ధన్నపేట మండలం పెరుమండ్లగూడెంకు చెందిన  బాబు అటుగా వెళ్తూ.. ఇంట్లో మౌనిక ఒంటరిగా ఉన్న విషయాన్ని గమనించాడు. మంచి నీళ్లు కావాలనే నెపంతో బలవంతంగా ఇంట్లో చొరబడ్డాడు. మౌనికపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో అక్కడే ఉన్న సుత్తితో తలపై కొట్టి.. చంపడానికి యత్నించాడు. తీవ్రంగా రక్తస్రావం కావడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మౌనిక చనిపోయిందని భావించిన బాబు అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, ఆ సమయంలో మౌనిక ఇంటికి దగ్గర్లోనే ఉన్న పల్లెపు లక్ష్మి అనే మహిళ అతడిని గమనించి   వెంటనే గ్రామస్థులకు సమాచారం అందించారు. వారు నిందితుడి కోసం గాలించి   గ్రామ శివారులో పట్టుకున్నారు.   తీవ్ర ఆగ్రహంతో అతడిపై కర్రలు, రాళ్లతో దాడిచేశారు. అక్కడి నుంచి గ్రామంలోకి తీసుకువచ్చారు. అప్పటికే ఈ సమాచారం అందుకున్న జఫర్‌గఢ్ ఎస్సై జహీర్‌ఖాన్ పోలీసులతో సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. మౌనికను 108 వాహనంలో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, గ్రామస్థులంతా తీవ్రంగా ప్రతిఘటించారు. పోలీసుల సమక్షంలోనే బాబును మళ్లీ చితకబాదారు. స్పృహ కోల్పోయిన నిందితుడిపై గడ్డి వేసి, కిరోసిన్ పోసి, నిప్పంటించారు. మంటల్లో కాలిపోయిన బాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మౌనిక పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను ఎంజీఎం ఆస్పత్రి నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. తలపై కుడివైపున బలమైన గాయం కావడంతో సిటీ స్కాన్ నిర్వహించామని, అవసరమైతే శస్త్రచికిత్స చేస్తామని నిమ్స్ వైద్యులు తెలిపారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...