Wednesday, February 16, 2011

ఆంధ్రకు చెందిన ఒరిస్సా ఐఎఎస్ అధికారిని కిడ్నాప్ చేసిన మావోలు

మల్కన్‌గిరి,ఫిబ్రవరి 17: : ఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లా కలెక్టర్‌ వినీల్‌ కృష్ణను బుధవారం రాత్రి మావోయిస్టులు అపహరించారు. అతని విడుదలకు 48 గంటల గడువు విధించారు. ఆయన విడుదలకు మావోయిస్టులు 17 డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లతో కూడిన పత్రాన్ని మావోయిస్టులు ఆంగ్లభాషలో వినీల్ కృష్ణతోనే రాయించారు. జైలులో ఉన్న తమ ఖైదీలను విడుదల చేయాలని, కేంద్ర బలగాలను ఉపసహరించాలని, కూంబింగ్ ఆపాలని వాటిలోని ప్రధానమైన డిమాండ్. కలెక్టర్ వినీల్‌కృష్ణ విడుదలకు మావోయిస్టులు 48 గంటల గడువు ప్రకటించారు. వినీల్ కృష్ణ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ కాగా ఆయన కుటుంబం గత 20 ఏళ్లుగా  హైదరాబాదులో ఉంటోంది. వినీల్ కృష్ణ ఐఐటి - మద్రాసు గ్రాడ్యుయేట్. 2005లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో చేరారు. 16 నెలల క్రితం మల్కన్‌గిరి కలెక్టర్‌గా వచ్చారు. ఒరిస్సాలోని చిత్రకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బడపదరలో జనసంపర్క్ శిబిరానికి హాజరైన కలెక్టర్‌ సాయంత్రం 4గంటలకు మజ్జి అనే జేఈతో కలసి శపపరమెట్ల గ్రామంలో పాఠశాల చూసేందుకు బైకుపై బయలుదేరారు.గమ్యం చేరుకునేలోగా మధ్యలోనే వారిని మావోయిస్టులు అపహరించారు. కలెక్టర్‌తో పాటు బడపదరలో జనసంపర్క శిబిరంలో పాల్గొన్న డీఆర్‌డీఏ పీడీ బల్వంత్‌సింగ్‌ చిత్రకొండకు తిరిగివచ్చారు. ఆయన తర్వాత రావాల్సిన కలెక్టర్‌ మాత్రం రాత్రి 10 గంటల వరకూ తిరిగిరాలేదు. వినీల్ కృష్ణను విడుదల చేయించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తగిన సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ముందుకు వచ్చింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...