సహాయనిరాకరణతో తెలంగాణ జిల్లాల్లో స్తంభించిన పాలన
హైదరాబాద్,ఫిబ్రవరి 17: తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంతో ఆ ప్రాంతంలో పాలన స్తంభించింది. ఉద్యోగులు పెన్ డౌన్, కార్మికులు టూల్‌డౌన్, ఉపాధ్యాయులు చాక్‌డౌన్ చేశారు. ఉద్యోగులు రిజిస్ట్టర్‌లో సంతకాలు చేసి, విధులను బహిష్కరించి కార్యాలయాల ఎదుట బైఠాయిం చారు. ఎక్సైజ్, రవాణా, రిజిస్ట్రేషన్, వాణిజ్య పన్నుల శాఖల్లో పన్నుల వసూళ్లూ నిలిచిపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడింది. ఉపాధ్యాయులు జనగణన కార్యక్రమాన్ని బహిష్కరించారు. తెలంగాణవాదులు, ఉద్యోగులు టికెట్లు తీసుకోకుండానే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, జేఏసీ నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎగువ నుంచి నాలుగో తరగతి ఉద్యోగుల వరకు విధులను బహిష్కరించడంతో సచివాలయం బోసిపోయింది. అన్ని శాఖల్లోని 90 శాతం మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నారని, సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నాగేందర్‌రావు తెలిపారు. నాంపల్లి క్రిమినల్ కోర్టు, సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి, సికింద్రాబాద్ కోర్టుల్లో న్యాయవాదులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించారు.
Comments