Wednesday, February 23, 2011

తెలంగాణ అంశంపై అట్టుడికిన లోకసభ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 23‌: తెలంగాణ అంశంపై బుధవారం లోకసభ అట్టుడికింది. తెలంగాణపై వెంటనే చర్చకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులతో పాటు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాల సభ్యులు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో లోకసభ కార్యక్రమాలు స్తంభించాయి.  స్పీకర్ మీరా కుమార్ సభను అరగంట పాటు వాయిదా వేశారు. తెలంగాణపై జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పినా ప్రతిపక్షాలు వినలేదు. తెరాస సభ్యులు కెసిఆర్, విజయశాంతి లేచి నిలబడి జై తెలంగాణ నినాదాలు చేశారు. వారికి మద్దతుగా ఎన్‌డిఎ సభ్యులు కూడా నినాదాలు చేశారు. వారితో కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు గొంతు కలిపారు. కెసిఆర్, విజయశాంతి స్పీకర్ పోడియం వద్ద బైఠాయించారు. దీంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. మంగళవారం తెలంగాణపై కెసిఆర్ ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. బుధవారం చర్చకు అనుమతిస్తానని హామీ ఇచ్చారు. అయితే, బుధవారం జీరో అవర్‌లో మాట్లాడేందుకు అవకాశం ఇస్తానని స్పీకర్ చెప్పడంతో కెసిఆర్, విజయశాంతి ఆందోళనకు దిగారు. వెంటనే తెలంగాణపై చర్చను చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...