Tuesday, February 22, 2011

బంద్ తో స్తంభించిన తెలంగాణ

బుధవారం కూడా  కొనసాగనున్న బంద్
హైదరాబాద్,ఫిబ్రవరి 22: 48 గంటల తెలంగాణ బంద్ తొలి రోజు సంపూర్ణంగా జరిగింది. విద్యా సంస్థలు, వ్యాపార సముదాయాలు మూతబడ్డాయి. రవాణా  వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో జన జీవనం పూర్తిగా స్తంభించింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం పార్లమెంటులో బిల్లు పెట్టాలనే డిమాండ్‌తో తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన 48 గంటల బంద్‌లో మంగళవారం అన్ని వర్గాల వారూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా పూర్తి స్థాయిలో బంద్ జరిగింది. సాయంత్రం దాటినా ఎక్కడా కనీసం దుకాణ సముదాయాలు కూడా తెరుచుకోలేదు. తెలంగాణ జిల్లాలన్నింట్లోనూ ప్రజలు పూర్తిగా బంద్ పాటించారు. రోడ్లపైఅడ్డుగోడలు కట్టారు. మానవ హారాలుగా ఏర్పడ్డారు. 16 చోట్ల రైళ్లను అడ్డుకున్నారు. పట్టాలపై ఫిష్ ప్లేట్లు తొలగించారు. పలుచోట్ల విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. ఆర్టీసీ కార్మికులు కూడా చరిత్రలోనే తొలిసారిగా బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు పలకడంతో తెలంగాణ అంతటా బస్సు సర్వీసులు దాదాపుగా నిలిచిపోయాయి. ఫలితంగా  ఆర్టీసీకి రూ.6 కోట్ల నష్టం వాటిల్లింది. నిరసనకారుల దాడిలో 769 బస్సులు ధ్వంసమయ్యాయి. జంటనగరాల్లో 15 బస్సుల అద్దాలను పగలగొట్టారు. హైదరాబాద్‌లో పాతబస్తీ మినహా ఎక్కడా బస్సులు తిరగలేదు. బుధవారమూ బంద్ కొనసాగనున్నందున తెలంగాణలో వరుసగా రెండో రోజు కూడా బస్సులు రోడ్డెక్కే పరిస్థితి లేదు. తెలంగాణవ్యాప్తంగా సింగరేణి గనుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో 1.8 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయి రూ.28 కోట్ల నష్టం వాటిల్లింది. టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, టీడీపీలతో పాటు పలు ప్రజా సంఘాలు తెలంగాణ అంతటా ర్యాలీలు, నిరసన ప్రదర్శన నిర్వహించాయి. రాజధానిలో ఎంఎంటీఎస్ రైళ్లను కూడా సాయంత్రం ఐదింటిదాకా ఆపేశారు. ఉస్మానియా ప్రాంగణం మరోసారి రణరంగంగా మారింది. వర్సిటీలో విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వడం, పోలీసులు బాష్పవాయువు గోళాలు ప్రయోగించడం; నిజాం కాలేజీ హాస్టళ్లలో విద్యార్థులు ప్రదర్శనలకు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీశాయి. అసెంబ్లీకి దారి తీసే రోడ్లను పూర్తిగా మూసేయడంతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. సహాయ నిరాకరణలో భాగంగా ప్రభుత్వోద్యోగులు తెలంగాణవ్యాప్తంగా విధులు బహిష్కరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ఆందోళనకారులు అడ్డుకున్నారు. పలు చోట్ల తెలంగాణవాదులు వాటర్ ట్యాంకులు, సెల్ టవర్లు ఎక్కి నిరసన తెలిపారు. జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్, అరుణోదయ విమలక్కలతో సహా 1,978 మందిని అరెస్టు చేశారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...