ముగిసిన 48 గంటల తెలంగాణ బంద్
హైదరాబాద్,ఫిబ్రవరి 23 తెలంగాణ రాజకీయ జేఏసీ పిలుపునిచ్చిన 48 గంటల తెలంగాణ బంద్ బుధవారం రెండో రోజు కూడా పూర్తిస్థాయిలో జరిగింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాలన్నింట్లోనూ ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. వాణిజ్య సముదాయాలు, సినిమాహాళ్లు, హోటళ్లు, విద్యాలయాలు మూతబడటంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. బస్సు, రైలు సర్వీసులు నిలిచిపోయాయి. వరంగల్ జిల్లాలో ప్యాసింజర్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టడంతో ఒక బోగీ పూర్తిగా, మరొకటి పాక్షికంగా తగలబడ్డాయి. ఇది మినహా బంద్ ప్రశాంతంగా జరిగిందని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. 90 శాతం ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోవడంతో సంస్థకు మరో రూ.6 కోట్ల నష్టం వాటిల్లింది. సాయంత్రం అయిదింటి దాకా ఎంఎంటీఎస్ రైళ్లను కూడా ఆపేశారు. ఆ తర్వాత నుంచి ఆర్టీసీ నగరంలో బస్సులు తిరిగాయి. అసెంబ్లీకి దారితీసే రోడ్లన్నింటినీ పూర్తిగా మూసేయడంతోరెండో రోజూ కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులపై 65 కేసులు నమోదు చేసి 974 మందిని ముందస్తుగా అరెస్టు చేసినట్టు డీజీపీ అరవిందరావు తెలిపారు. మొత్తంమీద బుధవారం 230 రాస్తారోకోలు, 118 కార్యాలయాల్లో సహాయ నిరాకరణ, 72 ధర్నాలు, 161 ర్యాలీలు, 46 దిష్టిబొమ్మలు దహనాలు, 18 మానవ హారాలు, 16 చోట్ల రైళ్ల నిలుపుదల, వంటి సంఘటనలు జరిగాయి.
Comments