అన్నవరం ఆలయం పునర్నిర్మాణ పనులు ప్రారంభం
అన్నవరం,,ఫిబ్రవరి 16: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణస్వామి వారి ప్రధాన ఆలయంలో పునర్నిర్మాణ పనులు బుధవారం ప్రారంభించారు. దర్శనాలను బుధవారం ఉదయం నుండి నిలిపివేశారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలోనే తాత్కాలికంగా ఏర్పాటుచేసిన బాలాలయంలో దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఉదయం 8 గంటల వరకు మాత్రమే ప్రధాన ఆలయంలో మూలవిరాట్‌ల దర్శనానికి అనుమతించారు. అనంతరం వేదపండితులు, అర్చకులు, వైదిక ప్రముఖుల పర్యవేక్షణలో కళాపకర్షణ, శిఖరంపై ఉండే కలశాల తొలగింపు కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం ఉన్న ఆలయం స్థానంలోనే కొత్త ఆలయం నిర్మించనున్నందున పనుల సమయంలో మూలవిరాట్‌లకు నష్టం వాటిల్లకుండా భారీ చెక్కపెట్టెను రక్షణగా ఏర్పాటు చేసారు. పాత ఆలయం తొలగింపునకు సుమారు 40 రోజులు, కొత్త ఆలయ నిర్మాణానికి సుమారు 8 నెలల సమయం పడుతుందని అంచనా. ఈ నేపథ్యంలో సుమారు 10 నెలల వరకు బాలాలయంలోని ఉత్సవమూర్తులనే భక్తులు దర్శించుకోవాల్సివుంటుంది. ఇక ఆలయంలో నిర్వహించే వ్రతాలు, కల్యాణాలు యథావిథిగా జరుగుతాయని దేవస్థానం వర్గాలు తెలిపాయి.

Comments