అట్టుడుకుతున్న లిబియా

కైరో, ఫిబ్రవరి 22:  లిబియా లో  మహ్మద్ గడాఫీ పాలనకు వ్యతిరేకంగా సాగుతున్న నిరసనలు రోజురోజుకూ ఉద్ధృతమవుతుండటంతో రాజధాని ట్రిపోలీలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ఆందోళనలను అణిచివేసే ప్రయత్నంగా అటు భద్రతా దళాలు, ఇటు గడాఫీ మద్దతుదార్లు మారణహోమం సృష్టిస్తున్నారు. నిరసనల సందర్భంగా గత కొద్ది రోజులు చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల్లో 84 మంది ప్రజలు మృతిచెందినట్టు ప్రభుత్వం చెబుతుండగా, 233 మంది మృతిచెందినట్టు మానవ హక్కుల సంస్ధలు ఘోషిస్తున్నాయి. మరోవైపు అధ్యక్షుడు గడాఫీ ఇప్పటికే దేశాన్ని వీడి వెళ్లిపోయాడన్న పుకార్లు వ్యాపించాయి. అయితే గడాఫీ లిబియాలో ఉన్నాడా? లేడా? అనే విషయాన్ని ఇప్పటివరకూ ఏ వార్తా సంస్ధ ధృవీకరించలేదు.  ఇదిలావుండగా, సంస్కరణలు తీసుకువచ్చేందుకై ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలకు నిరసనకారులు అంగీకరించకపోతే దేశంలో తీవ్రమైన అంతర్యుద్ధం తప్పదని అధ్యక్షుడు గడాఫీ కుమారుడు సైఫ్ అల్ ఇస్లామ్ గడాఫీ హెచ్చరించాడు. ట్రిపోలీలోని టెలివిజన్ చానల్ ద్వారా ప్రజలను ఉద్ధేశించి ప్రసంగిస్తూ ఆయన ఈ హెచ్చరిక చేశాడు. నాలుగు దశాబ్ధాల గడాఫీ పాలనను వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు ఉద్యమించడాన్ని ఆయన ఖండించాడు. లిబియాలో సాగుతున్న ప్రజా ఉద్యమాలను విదేశీ కుట్రగా సైఫ్ అల్ ఇస్లామ్ పేర్కొన్నాడు. అయితే ఆందోళనలను అణిచివేసే ప్రక్రియలో కొన్ని ‘పొరబాట్లు’ చోటుచేసుకున్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరిస్తూ ‘నవీన లిబియా’ నిర్మాణానికి సహకరించాల్సిందిగా పౌరులను కోరాడు.
భారతీయుల భద్రతకు చర్యలు...
లిబియాలోని భారతీయుల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సమీక్షిస్తోంది. ఆకాశమార్గం, సముద్రయానం ద్వారా భారతీయుల్ని తరలించే విషయాన్ని పరిశీలిస్తున్నారు.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు