Tuesday, February 22, 2011

పార్లమెంట్ లో తెలం'గానం'


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజు బీజేపీ, టీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణా అంశాన్ని లేవనెథారు.  ప్రస్తుత సమావేశాల్లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బిల్లు పెట్టాలని బీజేపీ లోక్‌సభలో డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని ఆ పార్టీ జాతీయ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాజ్‌నాథ్ సింగ్  పేర్కొన్నారు. రాష్టప్రతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు ఆయన ఈ ప్రస్తావన తెచ్చారు. ‘శ్రీకృష్ణ కమిటీ నివేదికపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుందో సభకు తెలియాల్సిన అవసరం ఉందని,  తక్షణమే.. ఈ సమావేశాల్లోనే బిల్లు తీసుకురావాలని,  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారానే తెలంగాణ అభివృద్ధిపథంలో నడుస్తుందని   పేర్కొన్నారు. మరోవైపు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్‌జైట్లీ కూడా తెలంగాణపై మాట్లాడారు. ‘తెలంగాణ ఏర్పాటుకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కూడా జీరో అవర్‌లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారు. తక్షణం లోక్‌సభలో తెలంగాణ బిల్లు పెట్టాలని, మద్దతు ఇస్తామని పేర్కొన్నారు. అంతకుముందు ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన సమయంలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సభలో మాట్లాడారు. వాయిదా తీర్మానానికి అనుమతిస్తూ తెలంగాణపై చర్చకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. అయితే స్పీకర్ అందుకు నిరాకరిస్తూ జీరో అవర్‌లో మాట్లాడాలని సూచించారు. జీరో అవర్ సరిపోదని, బుధవారమే  వాయిదా తీర్మానం ఇస్తామని కేసీఆర్ చె ప్పడంతో స్పీకర్ అంగీకరించారు.  అనంతరం కె.సి.ఆర్. తమ పార్టీ సహచర ఎంపీ విజయశాంతితో కలిసి పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, 'ప్రధానమంత్రికి మేం ఒక్కటే అప్పీలు చేస్తున్నాం. వారం రోజుల నుంచి 4 లక్షల మంది ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. పాలన స్తంభించింది. న్యాయవాదుల ఆందోళనతో న్యాయవ్యవస్థ స్తంభించింది. విద్యార్థి, ఉపాధ్యాయులు, లెక్చరర్ల ఆందోళనతో విద్యావ్యవస్థ స్తంభించింది. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. జేఏసీ పిలుపుమేరకు రెండు రోజుల బంద్ విజయవంతంగా ప్రారంభమైంది. ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నాయి. సీఎం కూడా చొరవ తీసుకోవాలి. డిసెంబరు 9 నాటి ప్రకటనను ముందుకు తీసుకెళ్లాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చి రెండు నెలలవుతోంది. ఇంకా తాత్సారం చేయడం ఎవరికీ శ్రేయస్కరం కాదు..’ అని పేర్కొన్నారు.   

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...