అసాధారణ భద్రత మధ్య ఇక 'సభా' పర్వం

హైదరాబాద్, ఫిబ్రవరి 16:  శాసనసభ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభ, శాసనమండలి సభ్యులనుద్దేశించి ఉదయం పదకొండు గంటలకు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభమవుతాయి. తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ ప్రభావం అసెంబ్లీ సమావేశాలపై పడకుండా డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, కృష్ణా జలాలపై ట్రిబ్యునల్ తీర్పు, శాంతిభద్రతలు వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు నిర్ణయించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే కాంగ్రెస్‌లో విలీనం కావాలని నిర్ణయించిన ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి అండగా నిలవనున్నారు.ఇలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తెరాస నిర్ణయించింది. అయితే తెరాస ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకూడదని ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి నిర్ణయించింది.  తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా అసెంబ్లీ బందోబస్తుకు పారా మిలటరీ బలగాలను ఉపయోగిస్తున్నారు. సందర్శకులపై ఆంక్షలు విధించారు. నగర పోలీసు శాఖ 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సాయుధ బలగాలను అసెంబ్లీ చుట్టూ మోహరింప చేస్తున్నారు. మూడంచెల భద్రతా వ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేస్నున్నారు. అడుగడుగునా తనిఖీలు చేయాలని, తగిన పాస్‌లు ఉంటే తప్ప ఎవరినీ లోనికి అనుమతించ వద్దని ఆదేశించారు. ఐదుగురు ఎసిపిలు స్వయంగా ఈ భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు