సిగ్గు,శరం విడిచిన తెలంగాణా ప్రజాప్రతినిథులు

అసెంబ్లీలో గవర్నర్ కు అవమానం
తలదించుకున్న ప్రజాస్వామ్యం

హైదరాబాద్,ఫిబ్రవరి 17: రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు యుద్ధవాతావరణంతో మొదలయ్యాయి. సమావేశాల తొలి రోజైన గురువారం గవర్నర్ ప్రసంగిస్తుండగానే సభ రణరంగంగా మారింది. టీఆర్‌ఎస్, టీడీపీల తెలంగాణ సభ్యులు గవర్నర్ గో బ్యాక్ అని నినదిస్తూ.. నరసింహన్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ముందున్న మైకులు విరిచి, టేబుల్‌ను ధ్వంసం చేసి, ఆయన కుర్చీని లాగి పడేశారు. ఒక దశలో గవర్నర్‌పై దాడి చేయటానికి కూడా కీ ప్రయత్నించారు. జాతీయగీతం ముగియగానే ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించటం మొదలుపెట్టారు. వెంటనే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేచి గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు మొదలుపెట్టారు. తమ చేతుల్లోని పేపర్లను చింపి గవర్నర్‌పైకి విసిరారు. పోడియం వద్దకు చేరుకుని నిరసనను తీవ్రం చేశారు. గవర్నర్ ముందున్న టేబుల్‌పై మైక్‌ను లాగివేశారు. ఇంతలో టీడీపీ తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా సభలోకి వచ్చారు. వస్తూనే ఆందోళన మొదలుపెట్టారు. రేవంత్‌రెడ్డి, మహేం దర్‌రెడ్డి వంటివారు గవర్నర్ ఉన్న వేదిక పైకి వెళ్లి వెనుక నుంచి కుర్చీలు లాగి కిందపడేశారు. గవర్నర్‌ను తోయటానికి ప్రయత్నించారు.  రేవంత్‌రెడ్డి ఒకింత ఆవేశంగా భద్రతాసిబ్బందిని నెట్టుకుంటూ గవర్నర్‌ను తోసేయటానికి యత్నించారు. దాంతో పక్కనే ఉన్న శాసనమండలి చైర్మన్ చక్రపాణి కాలు బెణికింది. మరోపక్క టీఆర్‌ఎస్ సభ్యుల నిరసన తీవ్రస్థాయికి చేరింది. గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. మైక్‌లను బలవంతంగా లాగిపారేశారు. మైక్ ఉన్న టేబుల్‌నూ లాగేశారు. ఈ దశలోనే గవర్నర్‌ పై దాడి చేయటానికి టీఆర్‌ఎస్ సభ్యులు ప్రయత్నించారు. అప్పటికే సభలోకి వచ్చిన మార్షల్స్ అడ్డుకున్నారు. ఈ పరిణామాల మధ్య గవర్నర్ తన ప్రసంగాన్ని నిలిపివేశారు. తాత్కాలిక మైక్‌ను ఏర్పాటు చేశాక గవర్నర్ మళ్లీ ప్రసంగం మొదలుపెట్టారు. దాంతో టీఆర్‌ఎస్ సభ్యులు ఆయనను అడ్డుకోవటం తీవ్రతరం చేశారు. ఈ దశలో టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యులు తమ కండువాలు, బ్యానర్లను నేరుగా గవర్నర్‌పైకి విసిరారు. ఇవి గవర్నర్‌  పై పడకుండా డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, సిబ్బంది ప్రయత్నించారు.ఇదే సమయంలో సభలోని రెండో వరుసలోని బల్లపైకి హరీష్‌రావు ఎక్కి చించిన కాగితాలను గవర్నర్‌పైకి విసరటం మొదలుపెట్టారు. ఆయనతోపాటు మరో సభ్యుడూ టేబుల్‌పైకి ఎక్కి ఆవేశంగా నినాదాలు చేశారు. హరీష్‌రావు టేబుల్‌పై నుంచి గవర్నర్‌ పై దూకే యత్నం చేశారు. మార్షల్స్ అడ్డుకోవటంతో వారిపై పడ్డారు. మరోపక్క టీడీపీ సభ్యులు రేవంత్‌రెడ్డి తదితరులు గవర్నర్ ఉన్న వేదికపైకి వెళ్లటానికి మళ్లీ ప్రయత్నించారు. ఈ గొడవలోనూ గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. చివరకు మార్షల్స్ టీఆర్‌ఎస్, టీడీపీ సభ్యులు కొందరిని బయటకు పంపించారు. తర్వాత కొద్దిసేపటికే గవర్నర్ తన ప్రసంగాన్ని కుదించి ముగించారు. సుమారు 45 నిమిషాల పాటు సాగాల్సిన గవర్నర్ ప్రసంగం 9 నిమిషాల్లో ముగిసింది. గంటపాటు జరగాల్సిన సభ 14 నిమిషాల్లో పూర్తయింది. ఇదంతా జరుగుతున్న సమయంలో సభలోనే ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ సీఎం రోశయ్య, ప్రతిపక్ష నేత చంద్రబాబు, పీఆర్పీ నేత చిరంజీవిలతోపాటు మిగతా సభ్యులంతా నిశ్చేష్టులయ్యారు. 

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు