Friday, September 2, 2011

ప్రముఖ పాత్రికేయులు నండూరి రామ్మోహన్‌రావు మృతి

విజయవాడ,సెప్టెంబర్ 2: ప్రముఖ పాత్రికేయులు నండూరి రామ్మోహన్‌రావు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొద్దికాలంగా మెదడు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. మంచి రచయితగా, సంపాదకుడిగా నండూరి సుప్రసిద్ధులు. విశ్వరూపం, విశ్వదర్శనం, నరావతారం, భారతీయ చింతన ఆయన సుప్రసిద్ధ రచనలు. ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఉదయం పత్రికలకు ఆయన సంపాదకులుగా సేవలందించారు. నండూరి రామ్మోహన్‌రావు మృతికి పలువురు ప్రముఖులు, పాత్రికేయులు సంతాపం ప్రకటించారు.  విశ్వరూపం, విశ్వదర్శనం ద్వారా సామాన్య ప్రజలకు  సైన్సు సంగతులు పరిచయం చేశారు.  ఆంధ్రపత్రికలో మార్క్ ట్వేన్ నవలలకు తెలుగు అనువాదాలు కూడా చేసారు.
జీవిత  విశేషాలు...
నండూరి రామమోహనరావు 1927 మార్చి 24వ తేదీన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం ఆరుగొలను గ్రామంలో జన్మించారు. నూజివీడు, మచిలీపట్నంలో చదివారు. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో విద్యార్థిగా ఉండగానే 'విజ్ఞానం' అనే లిఖిత పత్రికను నడిపారు. నండూరి తన 21వ ఏటనే పాత్రికేయుడిగా తన ప్రస్థానం ప్రారంభించారు. ఆయన జర్నలిస్టు జీవితం 'ఆంధ్రపత్రిక'లో ప్రారంభమైంది. 1948 నుంచి 1960 వరకు ఆయన 'ఆంధ్ర పత్రిక'లో పనిచేశారు. 1960లో సహ సంపాదకుడి హోదాలో 'ఆంధ్రజ్యోతి'లో అడుగు పెట్టారు. తొలితరం సంపాదకుడు నార్ల వెంకటేశ్వర రావుతో కలసి పని చేశారు. నార్ల నిష్క్రమణ అనంతరం 1980లో నండూరి రామమోహనరావు 'ఆంధ్రజ్యోతి' సంపాదకుడిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. 1960 నుంచి 1994 దాకా... అంటే 34 సంవత్సరాల కాలం ఆయన 'ఆంధ్రజ్యోతి'లో అక్షర యాత్ర చేశారు. ఆయన ఎంతో మందిని పాత్రికేయులుగా తీర్చి దిద్దారు. సూటిగా, సరళంగా ఉండే ఆయన సంపాదకీయాలు పాఠకులపై మంచి ప్రభావం చూపేవి. ఆయన 1962, 1978, 1984, 1992లలో అమెరికాలోను, 1982లో రష్యాలో పర్యటించారు. ' బాపు - రమణలు నండూరిని 'అనువాద హనుమంతుడు' అని కొనియాడారు. సుప్రసిద్ధ ఆంగ్ల రచనలను అచ్చ తెలుగులో, అందరికీ నచ్చేలా, తనదైన ప్రత్యేక శైలిలో అనువదించడమే దీనికి కారణం. మార్క్త్వేన్  రచించిన టామ్ సేయర్, హకిల్ బెరిఫిన్‌ లను అవే పేర్లతో అనువదించారు. మార్క్త్వేన్ మరో రెండు రచనలను రాజు - పేద, విచిత్ర వ్యక్తి పేరిట అనువదించారు. అలాగే... కాంచన ద్వీపం (రాబర్ట్ స్టీవెన్‌సన్) అనే మరో అనువాద రచన కూడా చేశారు. 61 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఆ పుస్తకాలకు ఆదరణ ఉండడం విశేషం. నండూరి ఖగోళ, భౌతిక శాస్త్రాలను పరిశోధించి 'విశ్వరూపం' అనే పుస్తకం రచించారు. మానవాళి పరిణామ క్రమానికి సంబంధించిన నరావతారం, తత్త్వశాస్త్రాన్ని సులువుగా వివరించే 'విశ్వ దర్శనం' ఆయన కలం నుంచి జాలువారినవే. నండూరి.. సవ్యసాచి పేరుతో రాజకీయ వ్యంగ్య రచనలు, హరివిల్లు పేరుతో బాల గేయాలు, ఉషస్విని పేరిట కవితలు రచించారు. కథా గేయ సుధానిధి  కూడా ఆయన రచనే. మిత్రలాభం, మిత్ర భేదం (పంచతంత్ర కథలు) పేరిట బాపు వేసిన బొమ్మలకు నండూరి మాటలను అందించారు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మతో కలిసి 'మహా సంకల్పం' అనే సంకలనాన్ని వెలువరించారు. సంపాదకీయాల సంకలనం అను పల్లవి, చిరంజీవులు, వ్యాఖ్యావళి ఆయన ఇతర రచనలు.  నండూరి రామమోహనరావుకు అనేకమంది ప్రముఖ పాత్రికేయులు, రచయితలతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆంధ్రపత్రికలో పని చేస్తున్నపుడు వారపత్రికకు సంబంధించి కొడవటిగంటి కుటుంబరావు, పండితారాధ్యుల నాగేశ్వరరావు, తెన్నేటి సూరి, పిలకాగణపతిశాస్త్రి వంటి హేమాహేమీలతో సాహిత్యంపై చర్చించేవారు. ఆంధ్రపత్రిక వీక్లీలో ఆంగ్ల రచనలను తెలుగులోకి అనువదించి ప్రచురించాలని సంకల్పించినప్పుడు... అనువాద బాధ్యతలను నండూరికే అప్పగించారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...