Tuesday, September 20, 2011

భూకంపం మృతుల సంఖ్య 72కి చేరిక

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20:  ఉత్తర, ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఆదివారం సంభవించిన పెను భూకంపం అపార నష్టాన్ని కలిగించింది.  మృతుల సంఖ్య 72కి చేరింది. భూకంప ప్రభావం అధికంగా ఉన్న  సిక్కింలో 41 మంది చనిపోయారు. భూ ప్రకంపనల ధాటికి రోడ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లు, పలు ఇతర నిర్మాణాలు నేలమట్టమవగా, కొన్ని చోట్ల మొబైల్ ఫోన్ టవర్లు కుప్పకూలాయి. ఇళ్ల శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండొచ్చన్నారు. 5 వేల మంది సైనిక సిబ్బంది, ఆరు విమానాలు, 15 హెలికాప్టర్ల ద్వారా సిక్కింలో సహాయక చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా ఆహార పొట్లాలను జారవిడుస్తున్నామన్నారు. కొండ చరియలు విరిగిపడటం, ప్రతికూల వాతావరణం కారణంగా సిక్కింలో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇదిలా ఉండగా, మేఘాలయలోని పలు ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక 4.3 తీవ్రతతో మళ్లీ భూకంపం సంభవించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. అటు మహారాష్ట్రలోని లాతూర్, ఉస్మానాబాద్, సోలాపూర్ సహా పలు జిల్లాల్లో సోమవారం ఉదయం 6.23 గంటలకు స్వల్ప ప్రకంపనలు సంభవించాయి.
సిక్కిం ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్.. భూకంప మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడినవారికి రూ.50 వేలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేల చొప్పున అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రూ.లక్ష పరిహారంగా  ప్రకటించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...