Thursday, September 15, 2011

మళ్ళీ పేలిన పెట్రో బాంబ్...!

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 16: నాలుగు నెలల వ్యవధిలో మరోసారి ప్రజల నెత్తిన పెట్రోబాంబు పేలింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరగడం, డాలరుతో రూపాయి మారక విలువ క్షీణించడాన్ని సాకుగా చూపుతూ పెట్రోలు రేట్లను మళ్లీ పెంచారు. ఈ మేరకు ప్రభుత్వరంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోలు రూ.3.14 నుంచి రూ. 3.32 వరకూ ధరలను పెంచాయి. స్థానిక పన్నుల కారణంగా వివిధ ప్రాంతాల్లో పెట్రో ధరల్లో వ్యత్యాసం ఉండనుంది. పెరిగిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడిచమురు ధర 111 అమెరికా డాలర్లకు చేరిందని, అందుకు అనుగుణంగానే పెట్రోలు రేట్లు పెంచాల్సి వచ్చిందని ప్రభుత్వరంగ చమురు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకపు విలువ రెండేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయిందని, ధరల పెరుగుదలకు ఇది కూడా ఒక కారణమని ఆయన వివరించారు. ‘‘ప్రభుత్వరంగ చమురు కంపెనీలు లీటరు పెట్రోలుపై రూ.2.61 చొప్పున నష్టపోతున్నాయి. రోజుకు రూ.15 కోట్ల నష్టాలు చవిచూస్తున్నాయి. లీటరుపై నష్టపోతున్న రూ.2.61కు వ్యాట్ ఇతర పన్నులు కలుపుకుని మొత్తమ్మీద రూ.3.14 పెంచాల్సి వచ్చింది’’ అని మరో ఉన్నతాధికారి తెలిపారు.కేంద్ర ప్రభుత్వం కిందటేడాది జూన్‌లోనే చమురు ధరలపై నియంత్రణను ఎత్తివేసింది. అప్పట్నుంచీ చమురు కంపెనీలు అడపాదడపా రేట్లను పెంచుతూనే ఉన్నాయి. మరోవైపు పెట్రోలు అమ్మకంపై ప్రభుత్వరంగ చమురు సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,450 కోట్లు నష్టపోయాయి. పెట్రోలు, డీజిల్, కిరోసిన్, ఎల్‌పీజీ అమ్మకాలపై ఈ కంపెనీలు రోజుకు రూ.263 కోట్లు నష్టపోతున్నాయి. లీటరు డీజిల్‌పై రూ.6.05, కిరోసిన్‌పై 23.25, గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.267 రాయితీ ఇస్తున్నాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...