Wednesday, September 28, 2011

మధ్యంతర ఎన్నికల ప్రసక్తి లేదు: ప్రధాని

చిదంబరం, ప్రణబ్‌లపై పూర్తి  విశ్వాసం 
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 28:  మన రాజకీయ వ్యవస్థను అస్థిరపరిచేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని,  మధ్యంతర ఎన్నికల కోసం విపక్షాలు తహతహలాడుతున్నాయని, అందుకోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాయని ప్రధాని మన్మోహన్ సింగ్ విమర్శించారు. అమెరికా పర్యటన నుంచి తిరిగొస్తూ ప్రధాని మంగళవారం రాత్రి ఎయిరిండియా వన్ ప్రత్యేక విమానంలో విలేకరులతో మాట్లాడారు. ‘విపక్షాలు నా ప్రభుత్వంలోని కొన్ని బలహీనతల్ని గుర్తించాయి. ఇక మధ్యంతర ఎన్నికలు వచ్చేలా చేయగలమని భ్రమపడుతున్నాయి. ఇది సరికాదు. ఐదేళ్ల పాటు పాలించేందుకు ప్రజలు మాకు అధికారమిచ్చారు. ఆ మేరకు పూర్తి కాలం పాటు పాలన అందిస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తాను ఇదివరకే పార్లమెంటులో స్పష్టంగా చెప్పానని, ఎన్నికల కోసం విపక్షాలు మరో రెండున్నరేళ్లు ఆగక తప్పదన్నానని గుర్తుచేశారు. తన ప్రభుత్వంలో దృక్కోణానికి సంబంధించిన సమస్య ఉంటే ఉండొచ్చని, ఒకవేళ ఉంటే దాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోం మంత్రి చిదంబరంల మధ్య విభేదాలొచ్చాయన్న వార్తలపై స్పందిస్తూ.. ‘మంత్రుల మధ్య ఎలాంటి గొడవలూ లేవు. ఆ మేరకు నాకు ఎలాంటి సమాచారం కూడా లేదు. కానీ మీడియాలో మాత్రం మంత్రుల మధ్య విభేదాలున్నట్టు వార్తలొస్తున్నాయి’ అని చెప్పారు. చిదంబరం 2008లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు స్పెక్ట్రమ్ వేలం కోసం పట్టుబట్టి ఉంటే 2జీ కుంభకోణాన్ని నివారించగలిగేవారని ప్రణబ్ నేతృత్వంలోని ఆర్థిక శాఖ(ప్రధాని కార్యాలయం కు పంపిన నోట్‌పై రాజకీయ దుమారం రేగడం విదితమే. 2జీ కేసులో చిదంబరానికి క్లీన్‌చిట్ ఇస్తారా అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘చిదంబరం, ప్రణబ్‌లపై నాకు పరిపూర్ణ విశ్వాసముంది’ అని చెప్పారు. తమది ఐకమత్యంతో కూడిన ప్రభుత్వమని, తన కేబినెట్‌లో అభిప్రాయభేదాలకు తావులేదని చెప్పుకొచ్చారు.  కాగా, సోమవారం 79వ వసంతంలోకి అడుగుపెట్టిన ప్రధాని మన్మోహన్ నాలుగోసారి కూడా తన పుట్టినరోజును ఎయిరిండియా వన్ విమానంలోనే జరుపుకున్నారు. అమెరికా పర్యటననుంచి తిరిగొస్తూ.. తనతోపాటు ప్రయాణిస్తున్న విలేకరుల సమక్షంలో కేక్ కట్ చేశారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...