Friday, September 23, 2011

చిదంబరం కు కష్టకాలం...!

న్యూఢిల్లీ,సెప్టెంబర్ 23:  2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో హోంమంత్రి చిదంబరం పాత్రపై విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో కాంగ్రెస్, కేంద్ర ప్రభుత్వం ఆయనకు దన్నుగా నిలిచాయి. చిదంబరం నిజాయితీని తాము ఏమాత్రం శంకించడం లేదని పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. చిదంబరం రాజీనామా చేయాలని, ఆయన పాత్రపై సీబీఐ విచారణ జరగాలని వస్తున్న డిమాండ్లను తోసిపుచ్చారు. చిదంబరం వైపు ఎలాంటి తప్పు లేదు కాబట్టి ఆయనకు ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని న్యాయశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ చెప్పారు. మరోవైపు ఈ కుంభకోణంపై ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ (పీఏసీ) హోదాలో విచారణ జరిపిన బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీ, ఆ పార్టీ రాష్ట్ర నేత దత్తాత్రేయ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చిదంబరం తక్షణమే రాజీనామా చేయాలని, లేదా ప్రధాని అయినా ఆయనను తప్పించాలని డిమాండ్ చేశారు.
ఆ లేఖపై మాట్లాడను: ప్రణబ్
న్యూయార్క్: 2జీ కుంభకోణంపై తన కార్యాలయం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు పంపిన లేఖపై స్పందించేందుకు ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ నిరాకరించారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని యన న్యూయార్క్ లో విలేకరులతో అన్నరు.  ‘‘సమాచార హక్కు చట్టం(ఆర్‌టీఐ) కింద దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి ద్వారా ఈ లేఖ బయటకు వచ్చింది. ఈ చట్టం ద్వారా భారత ప్రజలకు చాలా అధికారాలిచ్చాం. దేశం నుంచి అవినీతిని పారదోలేందుకు, పాలనను పారదర్శకంగా ఉంచేందుకు మేం తీసుకున్న అనేక చర్యల్లో ఈ చట్టం కూడా ఒకటి. ఈ లేఖను ఇవ్వాలంటూ సమాచార చట్టం ద్వారా ఇప్పటికే కొందరు ప్రధాని కార్యాలయాన్ని కోరారు. ఆ వివరాలను  కోర్టుకు కూడా సాక్ష్యంగా సమర్పించారు’’ అని అన్నారు.
ప్రధాని  మద్దతు
 2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో హోంమంత్రి పి. చిదంబరానికి ప్రధాని మన్మోహన్‌సింగ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నాటి ఆర్థిక మంత్రిగా, ప్రస్తుత హోంమంత్రిగా చిదంబరంపట్ల తనకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. అయితే 2జీ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున దీనిపై స్పందించబోనన్నారు.  కాగా, బుధవారం రాత్రే ఈ అంశంపై ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి చిదంబరంతో 20 నిమిషాలపాటు ఫోన్లో మాట్లాడిన మన్మోహన్... న్యూయార్క్ పర్యటన ముగించుకుని ఈ నెల 27న భారత్‌కు తిరిగి వచ్చేంత వరకు ఓర్పుగా ఉండాలని ప్రధాని.. చిదంబరానికి సూచించినట్లు తెలిసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...