Thursday, September 15, 2011

సకల జనుల సమ్మె ప్రభావంతో సింగరేణిలో స్తంభించిన బొగ్గు ఉత్పత్తి, రవాణా

హైదరాబాద్,సెప్టెంబర్ 16: సకల జనుల సమ్మె ప్రభావంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా స్తంభించటం.. విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లపైనే కాక.. ఇటుక బట్టీలు, ఔషధ తయారీ పరిశ్రమలు, సిమెంటు ఫ్యాక్టరీలు వంటి చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. హైదరాబాద్ పరిసరాల్లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్న ఈ పరిశ్రమలకు రోజూ ఒక్కో లారీ (సుమారు 17 టన్నులు) చొప్పున బొగ్గు సరఫరా అవుతుంది. కరీంనగర్ జిల్లాలోని సింగరేణి రామగుండం రీజియన్ నుంచి రోజూ దాదాపు 150 లారీల్లో ఇలాంటి పరిశ్రమలకు బొగ్గు రవాణా జరుగుతుంది. కానీ మూడు రోజులుగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా స్తంభించటంతో.. ఈ పరిశ్రమలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ముఖ్యంగా.. ఒకటి లేదా రెండు రోజులకు మాత్రమే బొగ్గు నిల్వలుంచుకునే సిమెంట్, ఫార్మా పరిశ్రమలు బొగ్గు కొరత కారణంగా ఉత్పత్తి నిలిపివేసే పరిస్థితికి చేరుకుంటున్నాయి.  సమ్మె కారణంగా సింగరేణిలో వరుసగా గురువారం మూడో రోజు కూడా బొగ్గు ఉత్పత్తి స్తంభించింది. ఖమ్మం జిల్లాలోని మణుగూరు, సత్తుపల్లి ఓపెన్‌కాస్టు గనుల్లో మినహా వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 36 భూగర్భ, 12 ఓపెన్ కాస్టు గనుల్లో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. సింగరేణి సంస్థ ఒక రోజు ఉత్పత్తి లక్ష్యం 1.65 లక్షల టన్నులు. మూడు రోజుల్లో 4.95 లక్షల టన్నులు ఉత్పత్తి కావాల్సి ఉండగా, 41,200 టన్నులు మాత్రమే జరిగింది. ఇది కూడా మణుగూరు, సత్తుపల్లి ఓపెన్‌కాస్టు గనుల్లోనే. మూడు రోజుల సమ్మెతో సింగరేణికి రూ. 67.50 కోట్ల నష్టం వాటిల్లింది. రైలు, రోడ్డు మార్గాలలో బొగ్గు రవాణా నిలిచిపోయింది. సత్తుపల్లి నుంచి బొగ్గు లోడుతో వస్తున్న లారీలను అడ్డుకొని ఆందోళనకారుల గాలి తీసేశారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...