Sunday, September 25, 2011

అంతమైన ‘ఆర్స్’

 కేప్ కానవెరాల్ ,సెప్టెంబర్ 25:    ప్రపంచమంతా ఆందోళన కలిగించిన అమెరికా ఉపగ్రహం ‘ఆర్స్’ ఎట్టకేలకు శనివారం ఉదయం భూమిపై రాలిపోయింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం కలిగించకుండానే తన ప్రస్థానాన్ని ముగించింది. 1991లో డిస్కవరీ వ్యోమనౌక ద్వారా ప్రయోగించిన ఈ మినీబస్సు సైజు ఉపగ్రహం పసిఫిక్ సముద్రం సమీపంలో కూలిపోయిందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వెల్లడించింది. ఈ ‘అప్పర్ అట్మాస్పిరియక్ రీసెర్చ్ శాటిలైట్(ఆర్స్)’ 26 ముక్కల వరకు విడిపోయిందని, ఇతర లోహపు శకలాలు కూడా భూమిపై పడిపోయాయని నాసా తెలిపింది. ఆరు టన్నుల బరువు గల ఆర్స్ భూ వాతావరణంలోకి ప్రవేశించగానే చాలావరకు మండిపోయి ఉంటుందని, 500 కిలోల శకలాలు మాత్రమే భూమిపై పడి ఉంటాయని పేర్కొంది. అయితే ఆర్స్ భూ వాతావరణంలోకి ఎప్పుడు ప్రవేశించింది? శకలాలు ఎక్కడ పడ్డాయన్న వివరాలు ఇంకా కచ్చితంగా తెలియలేదని చెప్పింది. అది పసిఫిక్ సముద్రం సమీపంలో కూలి పోయిందని, దాని శకలాలు కెనడా భూభాగంలో పడిపోయాయని ప్రాథమికంగా అంచనావేసినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే  ‘ఆర్స్’  కు  కాలంచెల్లిన తర్వాత దానిని భూమిపై కూల్చేందుకు కావలసిన నియంత్రణ వ్యవస్థను అందులో ఏర్పాటుచేయనందుకే ప్రస్తుతం దాని ఉనికి సరిగ్గా తెలియలేదని నిపుణులు భావిస్తున్నారు. కాగా 1979లో అమెరికాకే చెందిన స్కైలాబ్ అంతరిక్ష కేంద్రం కూడా విపరీత ఆందోళన కలిగించి, చివరికి హిందూ మహా సముద్రంలో కూలిపోయింది. ఆ తర్వాత 2001లో రష్యా చివరి అంతరిక్ష కేంద్రం ‘మిర్’ను ఆదేశం చక్కగా నియంత్రించి పసిఫిక్ సముద్రంలో కూల్చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...