తెలంగాణా రవాణా పై సమ్మెట...
హైదరాబాద్, సెప్టెంబర్ 20: సకల జనుల సమ్మెలో భాగంగా సోమవారం నుంచి ప్రారంభమైన ఆర్టీసి ఉద్యోగుల సమ్మె రవాణా వ్యవస్ధపై తీవ్ర ప్రభావం చూపుతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో వరుసగా ఏడోరోజు కూడా పని స్తంభించింది. ఉత్తర, దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని ముఖ్య నగరాలకు వెళ్లే జాతీయ రహదారులను తెలంగాణ వాదులు సోమవారం తెల్లవారుజాము నుంచే తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంతో, రవాణా వ్యవస్ధ పూర్తిగా స్తంభించింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా పది జిల్లాల ద్వారా వెళ్లే జాతీయ రహదారులను తెలంగాణ వాదులు దిగ్బంధించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. మొత్తం 89 డిపోల్లో ఉన్న 10వేల బస్సులు కదలలేదు. 58వేల మంది ఆర్టీసి కార్మికులు విధులను బహిష్కరించారు. తెలంగాణ ప్రాంతంలో ఆర్టీసీ బస్సులు నడవనందుకు రూ.8 కోట్ల నష్టం వాటిల్లిందని ఎండి బి ప్రసాదరావు వెల్లడించారు. ప్రైవేటు క్యారియర్ బస్సులు నడుపుకునేందుకు రూ.100కే పర్మిట్‌ను రవాణా శాఖ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఎక్కడ పర్మిట్ ఉన్నా రాష్ట్రంలో ఎక్కడైనా నడపుకునేందుకు వీలుగా ఈ పర్మిట్‌లను అనుమతిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Comments