Tuesday, October 11, 2022

అదిగో నవలోకం..‘ మహా కాల్ లోక్ ‘

భోపాల్, అక్టోబర్ 11; మధ్యప్రదేశ్‌ ఉజ్జయినిలో శ్రీ మహాకాల్ లోక్‌ కారిడార్‌ తొలిదశను ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేశారు. 12 జ్యోతిర్లింగాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన పురాతన మహాకాళేశ్వర్‌ ఆలయ ఆవరణ అభివృద్ధి ప్రాజెక్టు తొలిదశ కింద రూ.856 కోట్లతో చేపట్టిన నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఆలయంలో అభివృద్ధి చేసిన 900 మీటర్ల పొడవైన కారిడార్ 'మహాకాల్ లోక్‌'ను.. భక్తులను ఆథ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లేవిధంగా తీర్చిదిద్దారు. భక్తులకు స్వాగతం పలుతున్నట్టుగా రెండు ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. అందులో ఒకటి నందీ ద్వార్‌.. ఎత్తయిన రెండు నందులు.. భక్తులకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఈ ప్రవేశ ద్వారాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రవేశ ద్వారానికి ముందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇంకో ద్వారం పేరు పినాకి ద్వార్‌.. ఈ ద్వారంపైన ధనుస్సును అమర్చారు. త్రిపురాసురులు అనే రాక్షుసులను శివుడు హతమార్చినందుకు గుర్తుగా ఈ ద్వారానికి ఆ పేరు పెట్టారు. ఈ ద్వారాల నుంచి లోపలికి అడుగుపెట్టగానే 108 రాజస్థాన్‌ రాతి స్తంభాలు స్వాగతం పలుకుతాయి. జలయంత్రాలు.. 50 పైగా శివపురాణాన్ని తెలిపే కుడ్యచిత్రాలు.. అబ్బురపరుస్తాయి. నంది, భైరవ, గణేశ, పార్వతి మాత సహా ఇతర దేవతల విగ్రహాలు భక్తి పారవశ్యాన్ని కలిగిస్తాయి. మహాకాల్ లోక్‌ లో కమల్ సరోవర్ ప్రత్యేక ఆకర్షణ. ఈ సరస్సులో చుట్టూ కృత్రిమ కమలాలను ఏర్పాటు చేయగా.. మధ్యలో ధ్యానముద్రలో పరమశివుడు కొలువు దీరాడు. చుట్టూ సింహాలను ఏర్పాటు చేశారు. పరమ శివుడి చుట్టూ సప్త రుషుల.. విగ్రహాలు ఏర్పాటు చేశారు. కశ్యప, అత్రి, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, భరద్వాజ రుషుల ప్రతిమలను కూడా ఈ మహాకాల్‌ లోక్‌ లో ఏర్పాటు చేశారు. మహాకవి కాళిదాసు 'అభిజ్ఞాన శాకుంతలం'లో పేర్కొన్న జాతుల మొక్కలను సైతం ఇక్కడి ఆవరణలో నాటారు. రుద్రాక్ష్, బేల్‌పత్ర, సప్తపర్ణి వంటి 40 నుంచి 45 రకాల మొక్కలు సందర్శకులను అలరిస్తాయి. రాత్రి వేళల్లో విద్యుద్దీపాల వెలుగులో మహాకాల్‌ దీప్‌ దేదీప్యమానంగా వెలిగిపోతుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...