బి.జె.పి.లోకి జీవితారాజశేఖర్...?
హైదరాబాద్, ఏప్రిల్ 23: హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత భారతీయ జనతా పార్టీ లో చేరనున్నారు. వారిద్దరు ఈ నెల 25వ తేదీన పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడి సమక్షంలో వారు బిజెపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ సీనియర్ నేతలతో రాజశేఖర్, జీవిత మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. చాలా కాలంగా వారిద్దరు రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో వారు కాంగ్రెసు పార్టీలో చేరారు. వైయస్ రాజశేఖర రెడ్డి వారిద్దరిని కాంగ్రెసులోకి ఆహ్వానించారు. ఎన్నికల ప్రచారం కూడా పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం వారు కొంత కాలం వైయస్ జగన్‌తో ఉన్నారు. తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడానికి జీవిత, రాజశేఖర్ ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, వారు పెట్టిన షరతులు చంద్రబాబు నాయుడికి నచ్చలేదని, దాంతో తెలుగుదేశం పార్టీలో వారిని చేర్చుకోలేదని వార్తలు వచ్చాయి. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడంతో ఆ పార్టీలోకి మళ్లీ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. చివరకు బిజెపిలో చేరడానికి రాజశేఖర్, జీవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Comments