Tuesday, April 24, 2012

టి.ఎంపీలపై సోనియా గరం

లొక్ సభ నుంచి నాలుగు రోజులు సస్పెన్షన్
త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ
చిరు, రేణుకలకు పదవులు ?
న్యూఢిల్లీ,ఏప్రిల్ 24: కాంగ్రెసు తెలంగాణ లోకసభ సభ్యులపై పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అధికార పార్టీ సభ్యులై ఉండి లోకసభ సమావేశాలను అడ్డుకోవడంపై ఆమె వారిపై మండిపడుతున్నట్లు తెలుస్తోంది. రెండో విడత సమావేశాలు మంగళవారం మొదలైన రోజు కూడా  లోకసభ సమావేశాలను అడ్డుకోవడంతో సోనియా గాంధీ ప్రధాని కార్యాలయంలో కోర్ కమిటీ సభ్యులతో పరిస్థితిని చర్చించారు. ఆ తర్వాత తమ పార్టీ సభ్యులను ఎనిమిది మందిపై నాలుగు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం తీర్మానం ప్రతిపాదించింది. దాంతో  లోకసభ నుంచి నాలుగు రోజుల పాటు వారిని స్పీకర్ మీరా కుమార్ సస్పెండ్ చేశారు. ఇలాఉండగా  తమను మంత్రి పదవుల నుంచి తప్పించాలని, తాము పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేస్తామని నలుగురు కేంద్ర మంత్రులు సోనియాకు లేఖలు రాశారు. సోనియా సూచన మేరకే వారు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి, బడ్జెట్ సమావేశాల తర్వాత పార్టీలోనూ ప్రభుత్వంలోనూ భారీ మార్పులు ఉండవచ్చునని చెబుతున్నారు.  రాష్ట్రానికి చెందిన చిరంజీవికి, రేణుకా చౌదరికి మంత్రి పదవులు ఇస్తారని అంటున్నారు. అయితే, చిరంజీవికి పిసిసి అధ్యక్ష పదవిని అప్పగించే ఆలోచన కూడా లేకపోలేదని అంటున్నారు. పిసిసి పదవి నుంచి బొత్స సత్యనారాయణను తప్పిస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆయన స్థానంలో ఆయన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే పిసిసి పదవి అప్పగించాలనే ఆలోచన సాగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ కూడా పిసిసి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవిని ప్రచారం కోసం వాడుకుంటూ సంస్థాగత వ్యవహారాలను చక్కదిద్దే నాయకుడిని పిసిసి అధ్యక్షుడిగా నియమించదలుచుకుంటే కన్నా లక్ష్మి నారాయణకు అవకాశం లభించవచ్చునని అంటున్నారు. అలాగే  తెలంగాణపై నిర్ణయం తీసుకోకుండానే 2014 ఎన్నికలను ఎదుర్కోవడానికి సోనియా గాంధీ సిద్దపడుతున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...