Thursday, April 5, 2012

తాత్కాలిక సయోధ్య...!

న్యూఢిల్లీ,ఏప్రిల్ 6: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణలపై చర్య విషయంలో  ఉప ఎన్నికలయ్యే వరకు వేచి చూడాలని అధిస్టానం నిర్ణయించింది. ఈ లోగా  ఈ ఇద్దరు  నేతల పనితీరుపై   నిరంతర నిఘా ఉంచాలని భావిస్తోంది. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చే బాధ్యతను  కొందరు కోస్తా నేతలకు అప్పగించినట్టు సమాచారం. ఉప ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకుంటామని కిరణ్, బొత్సలిద్దరూ అధిష్టానానికి హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే సగం సీట్లయినా గెలుచుకోవాలన్న హైకమాండ్.. టి.డి.పి., వైఎస్సార్ కాంగ్రెస్‌లను  నిలువరించేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదలొద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కలిసికట్టుగా పనిచేసి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించింది. పార్టీని భ్రష్టు పట్టిస్తానంటే  హైకమాండ్ అనుమతించదంటూ ఈ ఇద్దరితో జరిపిన భేటీలలో ఆజాద్ ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించినట్టు భోగట్టా.   ఉప ఎన్నికలు పార్టీకి ఎంత ప్రతిష్టాత్మకంగా మారాయో ఆజాద్ ఈ సందర్భం గా వివరించారు.  ''ఉప ఎన్నికల ఫలితాలను బట్టే మీ పనితీరు ఏమిటనేది హైకమాండ్ అంచనాకు వస్తుంది. దానికి అనుగుణంగా భవిష్యత్తులో తగిన నిర్ణయం తీసుకుంటుందనే విషయాన్ని మర్చిపోకండి’’అని స్పష్టం చేశారుట. 
విభేదాలు మీడియా సృష్టే...బొత్స
రాష్ట్రంలో కాంగ్రెస్ పెద్దల మధ్య విభేదాలున్నాయన్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తనకు సమన్వయం కొరవడిందనడం అవాస్తవమన్నారు. ‘‘సీఎం, డిప్యూటీ సీఎం, నేను అంతా బాధ్యత ఎరిగిన వాళ్లమే. వాటిని గుర్తెరిగి అందుకు అనుగుణంగా నడుచుకుంటాం. పార్టీ తరఫున పునర్నిర్మాణం జరుగాలనే కోరుకుంటాం. మా నాయకత్వం అప్పగించిన పనులు చేస్తాం.   వ్యక్తులు కాదు వ్యవస్థ ముఖ్యం ’’ అని చెప్పారు.  బొగ్గు కొనుగోళ్లలో, ఏసీబీ దాడుల్లో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు.  ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేస్తామని, గెలుపోటములకు సమష్టి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటును నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణపై సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...