Tuesday, April 17, 2012

వాయలార్ వల్ల అవుతుందా...?

హైదరాబాద్,ఏప్రిల్ 17:  రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్ది , నాయకులను ఒక తాటి మీదికి తేవడానికి వాయలార్ రవి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదేశాల మేరకు హైదరాబాద్ వచ్చారు. అయితే  రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీగా గులాం నబీ ఆజాద్ తో కాని పని వాయలార్ రవితో అవుతుందా అనేది ఇప్పుడు ప్రశ్న. తెలంగాణ, వైయస్ జగన్ వ్యవహారం వంటి సమస్యలు ఓ వైపు పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుంటే పార్టీ నాయకుల్లో నెలకొన్న విభేదాలు రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితిని మరింత దిగజార్చాయి. ముఖ్యమంత్రి పదవి నుంచిరోశయ్యను దించి కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టిన తర్వాత సమస్యలు తగ్గకపోగా మరింత పెరిగాయి. పిసిసి అధ్యక్షుడిగా డి. శ్రీనివాస్ ఉన్నప్పుడు దాదాపుగా పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, ముఖ్యమంత్రికీ పిసిసి అధ్యక్షుడికీ మధ్య విభేదాలు ఉన్న జాడలు కనిపించలేదు. డి. శ్రీనివాస్ ఎలా వ్యవహరించేవారో తెలియదు గానీ దూకుడు ఎప్పుడూ ప్రదర్శించలేదు. ముఖ్యమంత్రి పదవిపై ఆశ పడినట్లు కూడా కనిపించలేదు. కానీ బొత్స సత్యనారాయణను పిసిసి అధ్యక్షుడిగా చేసిన వెంటనే కాంగ్రెసులోని పాత సంప్రదాయం మళ్లీ ముందుకు వచ్చింది. కాంగ్రెసు అధికారంలో ఉన్నప్పుడు పిసిసి అధ్యక్షుడికీ ముఖ్యమంత్రికీ పడకపోవడమనేది పార్టీ సంప్రదాయంగా ఉంటూ వస్తోంది. ఇప్పుడు బొత్స సత్యనారాయణకు, కిరణ్ కుమార్ రెడ్డికి ఏ మాత్రం పొసగడం లేదు. పైగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అసంతృప్తులను కూడగడుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. వచ్చే ఉప ఎన్నికల్లో గెలవడం మాట అటుంచి, ఈ ఇద్దరికి మధ్య సయోధ్య కుదుర్చడం, పార్టీని ఏక తాటి మీదికి తేవడం అనేది సాధ్యమవుతుందా అనేది ప్రశ్న. ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడిని, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పిలిచి ఆజాద్ క్లాస్ కూడా తీసుకున్నారు. అప్పటికప్పుడు ముగ్గురు కలిసి పోయినట్లే కనిపించారు. కానీ, వరుస మారినట్టు కనిపించక పోవడంతో సోనియా గాంధీ తన దూతగా వాయలార్ రవిని రంగంలోకి దించారు. వాయలార్ రవి కూడా ఇది వరకు రాష్ట్ర కాంగ్రెసు  వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు. అందువల్ల ఆయనకు రాష్ట్ర పరిస్థితులు తెలిసే ఉంటాయని, రాష్ట్ర కాంగ్రెసు నాయకులతో పరిచయాలు బాగానే ఉండి ఉంటాయని అనువకోవచ్చు. కానీ, ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దే పని ఆయనతో అవుతుందా అనేదే  ప్రశ్న. రాష్ట్రంలో 18 శాసనసభా స్థానాలకు, ఓ లోకసభ స్థానానికి  జరగనున్న  ఉప ఎన్నికలకు క్షేత్ర స్థ్యాయిలో పార్టీఈని సమాయత్తం చేయడానికే తాను వచ్చానని వాయలార్ రవి చెబుతున్నారు. . ఆయన ఈ మూడు రోజులు కలిసే నాయకుల అబిప్రాయాల మీదనే ఆధారపడే అవకాశం ఉంది. వారు చెప్పే విషయాలు కొత్తవేమీ కావు. కాంగ్రెసు నాయకులు బహిరంగంగానే తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఆజాద్ ముందు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. సమిష్టి బాధ్యత కోసం సమన్వయ కమిటీ కూడా వేశారు. మొక్కుబడికి రెండు సమావేశాలు జరిగాయి. మరో సమావేశం జరుగుతుందనే గ్యారంటీ లేదు. ఈ పరిస్థితిలో  వాయలార్ రవి సాధించేది ఏముంటుందని కొందరు పార్టీ పెద్దలు పెదవి విరుస్తున్నారు.  

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...