Monday, April 2, 2012

మయన్మార్ లో సూకీ సంచలనం..

యాంగాన్ ,ఏప్రిల్ 2:  మయన్మార్ రాజకీయాల్లో సంచలనం.. విపక్ష నాయకురాలు, ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్ సాన్ సూకీ తొలిసారి ప్రజాప్రతినిధిగా చట్టసభలో ప్రవేశించడానికి రంగం సిద్ధమైంది.ఆదివారం పార్లమెంటుకు జరిగిన కీలక ఉప ఎన్నికల్లో కవామూ స్థానం నుంచి సూకీ చారిత్రక విజయం సాధించారని ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ ప్రకటించింది. అయితే ఆమె విజయాన్ని ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. స్వతంత్ర సంస్థలు కూడా ధ్రువీకరించలేదు. ఆదివారం 45 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఎన్‌ఎల్‌డీ 44 చోట్ల పోటీ చేసింది. ఎన్నికల ఫలితాలను వారంలోగా అధికారికంగా ప్రకటించే   అవకాశముంది.యాంగాన్‌లోని ఎన్‌ఎల్‌డీ ప్రధాన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ సైన్‌బోర్డుపై సూకీ విజయ వార్తను ప్రకటించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంతోషంతో నృత్యాలు చేశారు. ఆనందబాష్పాలు రాల్చారు. ‘మేం గెలిచాం, మేం గెలిచాం’ అంటూ నినాదాలు చేశారు.  పోటీ చేసిన అన్ని స్థానాల్లో తామే విజయం సాధించనున్నట్లు ఎన్‌ఎల్‌డీ ధీమాగా చెబుతోంది. 22 ఏళ్ల కిందటి ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ విజయం సాధించినా అప్పటి జుంటా ప్రభుత్వం ఎన్నికల ఫలితాలను ధ్రువీకరించ కపోవడం తెలిసిందే. తర్వాత సూకీని ప్రభుత్వం సుదీర్ఘ కాలం గృహనిర్బంధంలో ఉంచింది. 2010లో ఆ నిర్బంధాన్ని తొలగించింది.నిరంకుశ సైనిక ప్రభుత్వంపై దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసిన సూకీ 1945లో రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో జన్మించారు. 1988లో యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి వచ్చారు. మహాత్మాగాంధీ బోధనలు, బౌద్ధమత అహింసా సూత్రాల ప్రేరణలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పాటుకు పోరాడారు. ఆమెకు 1991లో నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...