Wednesday, April 18, 2012

రాష్ట్ర వార్షిక ప్రణాళిక 48,935 కోట్లు

న్యూఢిల్లీ,ఏప్రిల్ 18: 2012-2013 సంవత్సరానికి  రాష్ట్ర వార్షిక ప్రణాళిక 48,935 కోట్లు రూపాయలుగా ఖరారయింది. మెట్రో ప్రాజెక్టు పనులు ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని ప్రణాళిక సంఘం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. పోలవరం వివాదం కోర్టులో ఉన్నందున ఎలాంటి వ్యాఖ్యలు చేయలేమని  కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అహ్లువాలియా అన్నారు. విద్య, ఆరోగ్యం అంశాలు జాతీయప్రమాణాల కంటే తక్కువగా ఉన్నాయని, ఈ అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని అహ్లువాలియా సలహా ఇచ్చారు.
13 శాతం ఎక్కువ:ముఖ్యమంత్రి
ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఆమోదించిన పెట్టుబడుల మొత్తం గత ఆర్థిక సంవత్సరం కన్నా 13 శాతం ఎక్కువని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. పోలవరం, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలని కోరినట్లు ఆయన తెలిపారు. ఆ రెండు ప్రాజెక్టులకు సూత్రబద్దంగా అన్ని అనుమతులు లభించాయని, కానీ పూర్తి అనుమతులు లభించిన తర్వాత వాటి గురించి మళ్లీ సిఫార్సు చేస్తామని ఆయన చెప్పారు. స్త్రీనిధి బ్యాంక్‌కు రూ.200 కోట్ల రూపాయలు ఇవ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. ట్రిపుల్ ఐటిలకు నిధులు ఇవ్వాలని కూడా కోరినట్లు ఆయన చెప్పారు. ట్రాన్స్ మిషన్ కారిడార్‌ను వెంటనే పూర్తి చేయాలని తాము కోరామని ఆయన చెప్పారు. గ్యాస్ ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకు గ్యాస్ మరింత కేటాయించాలని కోరామని ఆయన చెప్పారు. పార్టీ అధిష్టానం పరిశీలకుడు వాయలార్ రవిని మంత్రులు కలుసుకోవడంపై  ప్రస్తావించగా పార్టీ అధిష్టానం నేతలతో మంత్రులు కలిసి పార్టీ గురించి మాట్లాడారని, పార్టీని బలోపేతం చేయడంపై మాట్లాడారని ఆయన చెప్పారు. వాయలార్ రవి హైదరాబాద్ వెళ్తున్నారని తనకు తెలుసునని, తనకు అధికార కార్యక్రమాలు ఉండడం వల్ల ఢిల్లీలో ఉన్నానని ఆయన చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ పార్లమెంటు సమావేశాల వ్యవహారాలకు సంబంధించి బిజీగా ఉన్నారు కాబట్టి వాయలార్ రవి రాష్ట్రంలోని ఉప ఎన్నికల వ్యవహారాలను చూస్తున్నారని ఆయన చెప్పారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...