Monday, April 2, 2012

తిరుమల హుండీ ఆదాయం ఒకే రోజు రూ.5.73 కోట్లు !

చిత్తూరు,ఏప్రిల్ 2:  తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి  ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో ఆదాయాన్ని ఆర్జీంచారు. శనివారం సాయంత్రం 7 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు వేంకటేశ్వర స్వామికి హుండీ ద్వారా  రూ.5.73 కోట్లు ఆదాయం వచ్చింది.నగదు తోపాటు కిలో బంగారం కూడా ఇందులో ఉంది. కొంత విదేశీ కరెన్సీ కూడా ఉంది. ఐదేళ్లుగా స్వామివారి హుండీ ఆదాయం రోజురోజుకూ పెరుగుతూ రూ.కోటి దాటింది. అజ్ఞాత భక్తులు అధిక మొత్తంలో స్వామివారికి నిధులు సమర్పించిన సమయంలో ఇది రూ.రెండు నుంచి మూడు కోట్లు దాటుతోంది. మొత్తమ్మీద ఏడాదిలో సగటున చూస్తే రోజుకు రూ.కోటిన్నరకు పైగా ఆదాయం హుండీ ద్వారా లభిస్తోంది. 1980 సమయంలో రోజుకు రూ.లక్ష ఆదాయం వస్తేనే విశేషంగా భావించేవారు. అప్పట్లో అజ్ఞాత భక్తుల కానుకలు కూడా రూ.లక్ష దాటేవి కావు. 1990 నుంచి స్వామివారికి హుండీ కానుకలు పెరిగాయి.  ఐదేళ్ల నుంచి క్రమంగా రోజుకు రూ.కోటి దాటిన ఆదాయం ఆదివారం రూ.5.73 కోట్లకు చేరింది. ఇప్పటి వరకూ అత్యధికంగా వచ్చిన ఆదాయం రూ.3.75 కోట్లు కాగా ఆదివారంతో సరికొత్త రికార్డు నమోదైంది. నిజానికి శ్రీరామ నవమిని పురస్కరించుకుని తిరుమలలో రద్దీ స్వల్పంగానే ఉంది. కానీ హుండీ ఆదాయం మాత్రం గణనీయంగా ఉండడం గమనార్హం. మార్చి31తో ఆర్థిక సంవత్సరం ముగిసే నేపథ్యంలో తమకు లాభంగా వచ్చిన సొమ్ము నుంచి పారిశ్రామిక వేత్తలు అధిక మొత్తంలో స్వామి వారికి కానుకలు సమర్పించుకోవడం పరిపాటి. ఈ క్రమంలోనే ఆదివారం ఓ అజ్ఞాత భక్తుడు రూ.మూడు కోట్ల వరకు హుండీలో వేసినట్లు తెలిసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...