మళ్ళీ రాజకీయాలలోకి మాజీ రెబెల్ స్టార్...!
మొగల్తూరు,ఏప్రిల్ 25: తాను మళ్లీ క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు సినీ నటుడు, మాజీ ఎంపీ కృష్ణంరాజు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన కృష్ణంరాజు మనసులోని మాటను బయటపెట్టారు. ప్రజల ఇబ్బందుల్ని చూసే మళ్లీ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించారు.మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు.

Comments