ఎ.పి. వైపు జయప్రద చూపు...!
తిరుపతి,ఏప్రిల్ 3: హీరో నందమూరి బాలకృష్ణ అంటే తనకు ఎంతో అభిమానమని, పార్టీలకు అతీతంగా ఆయనకు తాను మద్దతిస్తానని ఉత్తరప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద అన్నారు. మంగళవారం ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఓ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ, బాలకృష్ణ తనను ఎప్పుడు పిలిచినా సపోర్ట్ చేస్తానని చెప్పారు. ఆ కుటుంబంతో మంచి అనుబంధం ఉందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుపై అభిమానంతో తాను టిడిపిలో చేరానని చెప్పారు. ఎన్టీఆర్ కారణంగా తాను బాబుకు మద్దతు పలికానన్నారు. బాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని బాగా పాలించారన్నారు. తనకు ఎపి పుట్టినిల్లు, యుపి మెట్టినిల్లు అని అన్నారు. ఎపి రాజకీయాలంటో ఇష్టం అని, ప్రస్తుతం ఎపి రాజకీయాలు తెలంగాణ తదితర సమస్యలతో క్లిష్టంగా ఉన్నాయని అన్నారు. తాను ప్రస్తుతం యుపి రాజకీయాల్లో ఉన్నానని, ఇక్కడకు వచ్చినప్పుడు ఏ పార్టీలో చేరాలనే అంశంపై పెద్దలతో చర్చిస్తానని ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదని అన్నారు.

Comments