Thursday, April 26, 2012

పీఎస్‌ఎల్‌వీ సీ-19 ప్రయోగం సక్సెస్

కక్ష్యలో రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం 
హైదరాబాద్ ,ఏప్రిల్ 26:  పీఎస్‌ఎల్‌వీ సీ-19 ద్వారా రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 (రిశాట్) ప్రయోగం విజయవంతమైంది.  శ్రీహరికోట సతీష్‌ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి గురువారం  ఉదయం 5గంటల 47 నిమిషాలకు ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-19 ఉపగ్రహం 17 నిమిషాల 50 సెకెన్లలో లక్ష్యానికి చేరుకుంది.  ఈ వాహకనౌక ద్వారా 1,830 కిలోలు బరువు కలిగిన రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 ను  480 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధ్రువకక్ష్య లోకి ప్రవేశపెట్టారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్ల ద్వారా ప్రయోగించిన ఉపగ్రహాల కంటే ఇది అతిపెద్ద ఉపగ్రహం. ఈ ప్రయోగానికి చంద్రయాన్-1 కు వినియోగించిన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను ఉపయోగించారు. 498కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ పీఎస్‌ఎల్‌వీ సీ-19 ప్రాజెక్టులో ఉపగ్రహానికి 378కోట్లు, రాకెట్‌కు 120కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దాదాపు పదేళ్లు కష్టపడి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన ఈ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహం-1 లో అమర్చిన సీ-బ్యాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అనే పరికరం భూమిని అన్ని వేళలా పరిశీలిస్తూ ఉంటుంది. ఖరీఫ్‌లో వర్షాల రాకను గుర్తిస్తుంది. వరదలను కూడా పసిగట్టే సామర్థ్యం ఉంది. అడవులు, భూమిలో దాగి ఉన్న జలవనరులు, నిధి నిక్షేపాల జాడను కనిపెడుతుంది. రక్షణకు సంబంధించిన అంశాలను అతి దగ్గరగా ఛాయాచిత్రాలు తీసి పంపుతుంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...