Friday, January 6, 2012

బాబు ' హోరు ' గల్లు యాత్ర...!

హైదరాబాద్ , జనవరి 6:   తెలంగాణలో ఉప ఎన్నికల ప్రచారానికి తానే నేరుగా వస్తానని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ని  లక్ష్యంగా చేసుకుని వరంగల్ జిల్లా లో  రైతు పోరు బాట యాత్ర జరిపిన చంద్రబాబు  ఇక తెరాస ఆటలు సాగవని హెచ్చరించారు. తెరాసకు విధివిధానాలు లేవని ఆయన అన్నారు. తెరాస కన్నా తమ పార్టీకే తెలంగాణలో పటిష్టమైన నాయకత్వం ఉందని ఆయన అన్నారు. కొన్ని రాజకీయ పరిణామాల ప్రభావం వల్ల తన తెలంగాణ పర్యటనలో జాప్యం జరిగిందని ఆయన చెప్పారు. తెలంగాణ జిల్లాల్లో క్రమం తప్పకుండా పర్యటిస్తానని ఆయన చెప్పారు. తెరాస కావాలనే గిల్లికజ్జాలు పెట్టుకుంటోందని ఆయన అన్నారు. రైతు సంక్షేమం కోసం తాను వస్తున్నానని ఆయన అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తాను వెనక్కి తగ్గేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ అన్ని సీట్లకు పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. రైతులపై ప్రేమ ఉంటే వారు కూడా పోరాడాలని, వారు పోరాడకుండా పోరాడేవారిపై దాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. రాజకీయంగా తమను ఎదుర్కోలేక అలా చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల కష్టనష్టాలు తెలుసుకునేందుకు వస్తుంటే తెలంగాణ అంటూ అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పినా అడ్డుకుంటే ఎలా అని ఆయన అడిగారు.
చంద్రబాబు నాయుడుపై కేసు
కాగా చంద్రబాబు యాత్ర సందర్భంగా అడుగడుగునా ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. చంద్రబాబు యాత్రను టిఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవాలని చూడటం, వారిని టిడిపి ప్రతిఘటించడం, పోలీసులు లాఠీ చార్జీ చేయడం వంటి  పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుపై కేసు పెట్టాలని వరంగల్ జిల్లా అడిషనల్ జ్యూడిషియల్ మెజిస్ట్రీట్ శుక్రవారం పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.  పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, న్యాయవాదులు వేసిన పిటిషన్ పైన స్పందించిన కోర్టు చంద్రబాబు తో పాటు , తెలుగుదేశం సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్‌పై వారం రోజుల్లో కేసు నమోదు చేసి విచారణ జరపాలని హన్మకొండ పోలీసులను ఆదేశించింది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...