Wednesday, January 11, 2012

విక్టరీ దర్శకుడు వి. మధుసూదనరావు మృతి

హైదరాబాద్, జనవరి 12 : విక్టరీనే తన ఇంటిపేరుగా మార్చుకుని.. ఎంతోమంది హీరోలను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శక నిర్మాత వీరమాచనేని మధుసూదనరావు (88) బుధవారం కన్నుమూశారు. దాదాపు పదేళ్ల నుంచి అనారోగ్యంతో దర్శకత్వానికి దూరమైన ఆయన.. బుధవారం రాత్రి జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీలోని తన ఇంట్లో తుది శ్వాస విడిచారు. 1923లో కృష్ణా జిల్లా ఈడ్పుగల్లులో  జన్మించిన మధుసూదనరావు.. ప్రముఖ దర్శకుడు కేఎస్ ప్రకాశరావు వద్ద శిష్యరికం చేసి, 1959లో తొలిసారిగా సతీ తులసి చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత ఆరాధన, గుడిగంటలు, రక్తసంబంధం, జమీందారు, అదృష్టవంతులు, ప్రజానాయకుడు, భక్తతుకారాం, ఇద్దరూఇద్దరే, జేబుదొంగ, ఈ తరం మనిషి లాంటి అనేక హిట్ సినిమాలను తెలుగు తెరకు అందించారు.  తెలుగులో మొత్తం 72 సినిమాలకు దర్శకత్వం వహించగా వాటిలో 60 సూపర్ హిట్లే.  అక్కినేని నాగార్జున, జగపతి బాబు, రమేష్‌బాబు లాంటి వారితో పాటు ఎంతోమందిని తెలుగు సినీ ప్రపంచానికి హీరోలుగా పరిచయం చేసింది  విక్టరీ మధుసూదనరావే. హిందీలో మూడు, కన్నడంలో రెండు సినిమాల కు దర్శకత్వం వహించిన మధుసూదనరావుకు 1997లో రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చింది. 1982లో ఆయన నంది అవార్డుల కమిటీలో సభ్యుడుగా పనిచేశారు. 1983 జనవరి 26న హైదరాబాద్‌లో సినీ రంగంలోని వివిధ విభాగాలలో శిక్షణ ఇచ్చేందుకు మధు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించారు. ఇక్కడ శిక్షణ పొందిన వారిలో ఎంతోమంది ప్రముఖ దర్శకులుగా, హీరోలుగా ఎదిగారు. ఈయనవద్ద పనిచేసిన 57 మంది అసిస్టెంట్ డైరెక్టర్లలో చాలామంది తర్వాతి కాలంలో ప్రముఖ దర్శకులుగా ఎదిగారు. వీరిలో చంద్రశేఖర్ రెడ్డి, రాఘవేంద్రరావు, కోదండరామి రెడ్డి, రాంచందర్‌రావు, కేఎస్ రెడ్డి, మురారి తదితరులున్నారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...