Friday, January 13, 2012

భాగస్వామ్య సదస్సు ద్వారా రాష్ట్రానికి 6,47,832 కోట్ల పెట్టుబడులు

హైదరాబాద్, జనవరి 13: తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్రంలో జరిగిన అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు అనూహ్య స్పందన లభించిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘మూడు రోజుల సదస్సులో మొత్తం 243 ఒప్పందాల ద్వారా 6,47,832 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. వాటిద్వారా మొత్తం 6,78,592 మందికి ఉపాధి లభించనుంది’’ అని వివరించారు. శుక్రవారం సదస్సు ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొత్తం పెట్టుబడుల్లో ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే రూ.1.75 లక్షల కోట్లు వస్తున్నాయని వివరించారు. ఒక్క విశాఖ స్టీలు ప్లాంటే రూ.42,500 కోట్లతో స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకొచ్చిందని చెప్పారు. అందుకవసరమైన గనులను కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. ''40 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. ఇందులో ఒప్పందాలు కుదిరిన భారీ ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించేందుకు ఎస్కార్ట్ అధికారులను నియమించనున్నాం. పరిశ్రమల అవసరాలను వారు ఎప్పటికప్పుడు తెలుసుకుని తీరుస్తారు. ప్రాజెక్టుల అమలును నెలకోసారి స్వయంగా సమీక్షిస్తాను. పరిశ్రమలకు ఆన్‌లైన్ ద్వారా అనుమతులు మంజూరు చేసేందుకు దేశంలోనే తొలిసారిగా మరో మూడు నెలల్లో రాష్ట్రంలో జీ టు బీ (గవర్నమెంట్ టు బిజినెస్) పోర్టల్‌ను కేంద్రం ప్రారంభించనుంది. ఇకనుంచి పరిశ్రమలకు అవసరమైన అన్ని అనుమతులూ ఆన్‌లైన్ ద్వారానే లభిస్తాయి. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. పరిశ్రమలకు కరెంటు కొరత లేదు. జల, గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గడం, సాంకేతిక సమస్యలతో కొన్ని ప్లాంట్లు మూతపడటం వల్ల గతంలో కోత విధించాల్సి వచ్చింది. కేస్-1 బిడ్డింగ్ ద్వారా 2,000 మెగావాట్లు కొనుగోలు చేస్తున్నందున వాటికి కొరత తీరనుంది. ఈ సదస్సులోనే ఏకంగా 54 వేల మెగావాట్ల సామర్థ్యమున్న విద్యుత్ ప్రాజెక్టులకు ఒప్పందాలు కుదుర్చుకున్నాం.  రూ.40 వేల కోట్లతో 6,400 మెగావాట్ల సామర్థ్యమున్న ప్లాంట్ల స్థాపనకు జీవీకే గ్రూపుతో ఒప్పందం కుదిరింది. జీవీకే, ఎన్టీపీసీ, జెన్‌కో, సింగరేణి వంటివాటితో మొత్తం రూ.2 లక్షల కోట్లతో విద్యుత్కేంద్రాల స్థాపనకు ప్రభుత్వానికి ఒప్పందాలు కుదిరాయి. ప్రైవేట్ ప్లాంట్ల నుంచి 25 శాతం విద్యుత్ పొందేందుకు కృషి చేస్తున్నాం. అనుబంధ పరిశ్రమలు లేనందుకే రాష్ట్రంలో ఆటో పరిశ్రమలు రావడం లేదు. త్వరలో వస్తాయి. మహీంద్రా ట్రాక్టర్ల యూనిట్ ఇప్పటికే వచ్చింది.కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్న పరిశ్రమలకు భూ సేకరణ సమస్య కాబోదు. కొత్తగా రూపొందిస్తున్న విధానం మేరకే కేటాయింపులుంటాయి. పైగా అన్ని పరిశ్రమలకూ భూమి అవసరముండదు. అవసరమైన వాటికి ప్రభుత్వమే సేకరించి ఇస్తుంది. కొత్త విధానం మేరకు ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది. పనులు ప్రారంభించని పరిశ్రమల నుంచి సంబంధిత శాఖలు భూమిని వెనక్కి తీసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాన్యుఫాక్చరింగ్ పెట్టుబడి ప్రాంతానికి రాష్ట్రంలో 25 వేల హెక్టార్ల భూమి అవసరం అవుతుంది. అందుకు ఐదారు ప్రాంతాలను కేంద్రం పరిశీలిస్తోంది. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు’’  అని ముఖ్యమత్రి వివరించారు.      

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...