ఇక మొబైల్ ఫోన్ ద్వారా రైలు టికెట్
న్యూఢిల్లీ,జనవరి 4: రైలు టికెట్లను ఇకమీదట మొబైల్ ఫోన్ ద్వారానే పొందవచ్చు. పేరును రిజిస్టర్ చేసుకోవడంతోపాటు.. మొబైల్‌లో ఇంటర్నెట్ సదుపాయం ఉండి తగిన సాఫ్ట్ వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే రైలు టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్ ద్వారా ఈ-టికెట్‌ను బుక్ చేసుకునే ఈ సౌలభ్యాన్ని రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ‘ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ’(ఐఆర్‌సీటీసీ) ఇప్పటికే ప్రయోగాత్మకంగా చేపట్టినట్టు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇలా బుక్ చేసుకున్న తరువాత ప్రయాణికులకు పీఎన్‌ఆర్, రైలు నంబర్, ప్రయాణ తేదీ, ఎక్కే తరగతి తోసహా పూర్తి వివరాలతో కూడిన రిజర్వేషన్ మెసేజ్ వస్తుంది. దీనితో ప్రయాణికులు ఈ-టికెట్ ప్రింటవుట్‌ను ఇక తమతోపాటు తీసుకెళ్లనక్కర్లేకుండా ప్రయాణ సమయంలో మొబైల్ మెసేజ్‌ను చూపితే సరిపోతుంది. ఈ విధంగా టికెట్ బుక్ చేసుకునేందుకు మొదటిసారి మాత్రమే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత నుంచి ఐడీ, పాస్‌వర్డ్ వినియోగించి టికెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఈ-టికెట్లకోసం వసూలు చేసే సర్వీస్ చార్జీని స్లీపర్ క్లాస్‌కు రూ.10, ఆపై తరగతికి రూ.20 చొప్పున వసూలు చేస్తారు.
Comments