Saturday, January 21, 2012

సమన్వయ భేటీ లో అజాద్ అసహనం...!

హైదరాబాద్,జనవరి 22: కాంగ్రెస్ లో ముఠాపోరును సహించేదిలేదని  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి గులాంనబీ ఆజాద్  పార్టీ నేతలను హెచ్చరించారు. 'ఇలాగైతే కాంగ్రెస్‌కు పుట్టగతులుండవు. ముఠాపోరును సహించేది లేదు. ప్రజల్లోకి వెళ్లకుండా సచివాలయంలోనే కూర్చుంటే ఎలా? పార్టీ, ప్రభుత్వంపై ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుంది' అని పార్టీ నేతలకు  ఆజాద్‌ స్పష్టం చేశారు.  హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో  గులాంనబీ ఆజాద్‌-- పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవన్నారు. పార్టీ, ప్రభుత్వం దేనికదే అన్నట్లుంటే అధిష్టానం చూస్తూ ఊరుకోదని, మంత్రులు, ఎమ్మెల్యేలు సచివాలయంలో కూర్చోకుండా జిల్లాల్లో పర్యటించాలని  హితవు పలికారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి బాగోలేకనే వివిధ ఎన్నికలను నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నామని,ఇలా ఎన్నాళ్లు వాయిదా వేస్తారని పార్టీనేతల్ని ఆజాద్‌ ప్రశ్నించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ, కాంగ్రెస్‌ పార్టీ పై పడుతున్న ప్రభావం, జగన్‌ను దృష్టిలో పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న యాత్రలు తదితర విషయాల్ని పార్టీ నేతలంతా ఆజాద్‌కు వివరించారు. అయితే అధికార పార్టీగా మీరేం చేస్తున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలను ఆజాద్‌ ప్రశ్నించినట్లు సమాచారం. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...