విద్యుత్ 'బాదుడు' నుంచి ఊరట

హైదరాబాద్, జనవరి 21:   వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఇంధన సర్దుబాటు చార్జీల భారం నుంచి వినియోగదారులకు ఊరటనిస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. వినియోగదారుల నుంచి 2008-09 సంవత్సరానికి సంబంధించి రూ.1,649 కోట్ల సర్‌చార్జీలను వసూలు చేసుకునేందుకు  విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) లకుఅనుమతినిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) 2010లో ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. సర్‌చార్జీ వసూలు ప్రతిపాదనలను డిస్కంలు నిర్ణీత కాల వ్యవధి ముగిసిన తరువాత సమర్పిస్తే.. ఆ ఆలస్యాన్ని మాఫీ చేస్తూ సర్‌చార్జీల వసూలుకు అనుమతినిచ్చే అధికారం ఈఆర్‌సీకి లేదని తేల్చి చెప్పింది. అలాగే ప్రతిపాదనల సమర్పణ కాలవ్యవధిని పెంచే అధికారం కూడా ఈఆర్‌సీకి ఎంత మాత్రం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. 2008-09 కి సమర్పించిన ప్రతిపాదనలు చెల్లుబాటుకావని, అవి కాలపరిమితి దాటిన ప్రతిపాదనలని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి మదన్ బి.లోకూర్, జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది. వాస్తవానికి ప్రతి మూడు నెలలకొకసారి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించాలి. కానీ వెయ్యిరోజులు, ఐదు వందల రోజుల అసాధారణ జాప్యంతో ప్రతిపాదనలు సమర్పిస్తున్నాయి. ఇదే విధంగా 2008-09 సంవత్సరానికి గృహ వినియోగదారులు, పరిశ్రమలు, వాణిజ్య వర్గాల నుంచి రూ.1649 కోట్ల సర్‌చార్జీ వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతినిస్తూ ఈఆర్‌సీ 2010 జూన్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ పలు కంపెనీలు, రైస్ మిల్లర్లు, తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలను విచారించిన సింగిల్ జడ్జి జస్టిస్ ఎన్.వి.రమణ ప్రతిపాదనలు సరైన పద్ధతిలోలేవని, బహిరంగ విచారణ అనంతరం మళ్లీ ప్రతిపాదనలు సమర్పించాలని పేర్కొంటూ తీర్పునిచ్చారు. నిర్ణీతకాల వ్యవధిలోపు డిస్కంలు ప్రతిపాదనలను సమర్పించలేని పక్షంలో.. కాల వ్యవధిని పెంచే అధికారం ఈఆర్‌సీకి ఉందని పేర్కొన్నారు. దీనిని సవాలు చేస్తూ హైకోర్టు ధర్మాసనం ముందు వేర్వేరుగా 153 అప్పీళ్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.

Comments

Popular posts from this blog

మాజీమంత్రి దండు శివరామరాజు కన్నుమూత

నవలా రచయిత అవసరాల రామకృష్ణారావు మృతి

కొత్తగా ఏడు రూట్లలో కింగ్ ఫిషర్ విమానాలు