Wednesday, July 31, 2013

తెలంగాణా తంతు నానేనా...

న్యూఢిల్లీ, జులై 31: ఐదు దశాబ్దాలుగా రగులుతున్న తెలంగాణా  సమస్యకు 'రాష్ట్ర విభజనే' పరిష్కారమని  కాంగ్రెస్ పార్టీ తేల్చేయడం తో  దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావానికి అంకురార్పణ పూర్తయింది.  పది జిల్లాలతో కూడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు నిన్న  కేవలం మూడు గంటల వ్యవధిలో... అటు యూపీఏ సమన్వయ కమిటీతో, ఇటు సీడబ్ల్యూసీతో కాంగ్రెస్ 'ఆమోద ముద్ర' వేయించింది.  'సీమ-ఆంధ్ర' రాష్ట్రం 'ఆంధ్రప్రదేశ్‌గానే కొనసాగుతుందని,  ఇన్నాళ్ళుగా ఈ సమస్యకు కేంద్ర బిందువుగా ఉన్న హైదరాబాద్ పదేళ్ళ పాటు రెండు రాష్ట్రాలకు ఉమండి రాజధానిగా ఉంటుందని, ఈ లోగా  'అనువైన చోట' ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ చెప్పారు.  నదీ జలాలు, విద్యుదుత్పత్తి-పంపిణీ, మూడు ప్రాంతాల్లోని ప్రజలందరి భద్రత-రక్షణ, ప్రాథమిక హక్కుల పరిరక్షణపై నిర్దిష్టమైన కాలపరిమితిలోపు ప్రత్యేకమైన వ్యవస్థ కు రూపకల్పన జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు .
కార్యాచరణ  ఇలా....
తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ తగిన తీర్మానం చేసేందుకు వీలుగా ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్  శాసనసభకు కేంద్ర ప్రభుత్వం నివేదిస్తుంది. అసెంబ్లీ తీర్మానం కేంద్ర మంత్రివర్గానికి చేరిన  తర్వాత నదీజలాలు, విద్యుత్, ఆస్తులు - అప్పుల్లో వాటాల పంపిణీ తదితర అంశాలన్నింటినీ పరిశీలించేందుకు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటవుతుంది. ఈ అన్ని అంశాలనూ పరిశీలించి కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించాక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లును రూపొందించేందుకు వీలుగా ఆ నివేదికను కేంద్ర న్యాయ శాఖకు పంపుతారు. అనంతరం ఆ  బిల్లుపై  ఆంధ్రప్రదేశ్ శాసనసభ  అభిప్రాయం కోరతారు.  అయితేశాసనసభ తీర్మానానికి గానీ, అభిప్రాయాలు, సూచనలకు గానీ కేంద్రం  కట్టుబడాల్సిన అవసరం గాని,  వాటిని విధిగా ఆమోదించాల్సిన అవసరం  గానీ ఉండదు. ఈ లాంచనం  తర్వాత తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రతిని కేంద్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్రపతికి పంపుతుంది.రాష్ట్రపతి ఆమోదంతో  బిల్లును పార్లమెంట్ పరిశీలనకు వస్తుంది.బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు సాధారణ మెజారిటీతో ఆమోదించాక అది తిరిగి రాష్ట్రపతి వద్దకు వెళ్తుంది దీనితో  తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫికేషన్ విడుదల చేస్తారు.  మొత్తంమీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ దాదాపుగా నాలుగైదు నెలల్లో పూర్తయ్యే విధంగాఈ ఈ కార్యాచరణ ఉంటుంది. కాగా,  రాష్ట్ర విభజనకు పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమయ్యే రాజ్యాంగ సవరణ  విషయం లో ఇంకా స్పష్టత  రావాల్సి ఉంది. 
విలీనం నుంచి విభజన దాకా....
ఒకప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబరు 17న ఇండియన్ యూనియన్‌లో భాగమైంది. 1956లో ఆంధ్రరాష్ట్రంతో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించింది. తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న డిమాండ్‌తో పొట్టి శ్రీరాములు 1952లో 56 రోజుల పాటు చేసిన ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగా భాషాప్రాతిపదిక ఏర్పాటైన ఆంధ్రరాష్ట్రంతో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలపాలన్న ప్రతిపాదనను 1953లో కాంగ్రెస్ అధిష్ఠానం తెరపైకి తెచ్చింది.దీనికి తెలంగాణ ప్రాంతంలో వ్యతిరేకత వ్యక్తమైనా అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం కాంగ్రెస్ అధిష్ఠానానికి మద్దతు పలికారు. దీంతో కర్నూలు రాజధానిగా 1953లో ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. తరువాత  కేవలం తెలుగు భాష మాట్లాడే ప్రజలను ప్రాతిపదికగా తీసుకుని 1956లో  హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. మొదట దీనికి తెలంగాణ ప్రాంత ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా ఆ ప్రాంత ప్రజల హక్కులకు ఎలాంటి భంగం కలగదన్న హామీతో విలీన ప్రతిపాదన తీర్మానాన్ని ఆంధ్రరాష్ట్ర అసెంబ్లీ 1955 నవంబరు 25న ఆమోదించింది.  1956 ఫిబ్రవరి 20న తెలంగాణ, ఆంధ్రరాష్ట్ర ప్రాంతాల నాయకుల మధ్య  'పెద్ద మనుషుల ఒప్పందం' జరిగింది. దీనిపై బెజవాడ గోపాలరెడ్డి, బూర్గుల రామకృష్ణారావు సంతకం చేశారు. ఎట్టకేలకు రాష్ట్రాల పునర్విభజన చట్టాన్ని అనుసరించి తెలుగు మాట్లాడే ప్రజలందరితో కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించింది. నాటి నుంచి జైఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ నినాదాలతో సమైక్య ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలన్న డిమాండ్లు ఊపిరి పోసుకున్నాయి.  తొలిసారిగా 1969లో పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారంటూ తెలంగాణ ప్రాంత ప్రజలు నిరసన గళం విన్పించారు.
-కాంగ్రెస్ నాయకుడుగా న మర్రి చెన్నారెడ్డి ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజా సమితి పేరుతో పార్టీని స్థాపించారు. విద్యార్థుల సహకారంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొంత కాలం ఉద్ధృతంగా సాగింది. నాటి పరిస్థితుల తీవ్రతను తగ్గించేందుకు అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 1969 ఏప్రిల్ 12న 8 సూత్రాల ప్రణాళికను రూపొందించారు. అయితే తెలంగాణ ప్రాంత నాయకులు దాన్ని తిరస్కరించారు. మరోవైపు
- తెలంగాణ ఉద్యమానికి  ధీటుగా 1972లో సీమాంధ్ర ప్రాంతాల్లో జైఆంధ్ర ఉద్యమం మొదలైంది. - ఇరుప్రాంతాల్లో శాంతియుత పరిస్థితులను తీసుకొచ్చేందుకు 1973 సెప్టెంబరు 21న 6 సూత్రాల పథకం తెరపైకి వచ్చింది. -ఉద్యోగ నియామకాల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ 1985లో తెలంగాణ ప్రాంతంలో నిరసన స్వరాలు మొదలయ్యాయి. దీంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజల ఉద్యోగభద్రతకు జీవోను తీసుకొచ్చింది. తరువాత 1999 వరకు ఉద్యమాలు  లేకున్నా 2001 ఏప్రిల్ 21న తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. చివరకు  రాష్ట్ర విభజనకు బాటలు వేసింది.    

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...