Thursday, July 18, 2013

మృత్యువుతో పోరాడుతూనే 95వ పుట్టినరోజు

వాషింగ్టన్ , జూలై 18 :  దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతూనే 95వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా ఉద్యమించి, రాబెన్ దీవిలో 27 సంవత్సరాల సుదీర్ఘ
కారాగార వాసం అనుభవించిన తర్వాత, ఆ దేశానికి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి అధ్యక్షుడిగా నిలిచారు. నోబెల్ శాంతి బహుమతి సహా పలు అవార్డులు, రివార్డులు పొందారు. భారత ప్రభుత్వం కూడా ఆయనను నెహ్రూ శాంతిబహుమతితో సత్కరించింది. బాపూజీ బోధించిన అహింస, శాంతియుత విధానాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తరచు చెప్పే మండేలా.. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, చికిత్సకు మండేలా స్పందిస్తున్నారని ఆ దేశ అధ్యక్షుడు జాకబ్ జుమా కార్యాలయం ఇటీవలే ప్రకటించింది. అయితే, నల్లజాతి యావత్తు స్వేచ్ఛావాయువులు పీల్చడానికి తన జీవితాన్నే ధారపోసిన మండేలా మాత్రం.. తన శ్వాస ఆపేయాలని కోరుతున్నారు. ఈ ప్రత్యక్ష నరకాన్ని తాను భరించలేనని ఆయన చెబుతున్నట్లు తెలిసింది. కానీ దక్షిణాఫ్రికా జాతి మాత్రం ఆయన్ను వీలైనంత ఎక్కువ కాలం కాపాడుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇక.. నెల్సన్ మండేలా 95వ జన్మదినం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. తన కుటుంబం తరఫున, అమెరికా ప్రజల తరఫున తాను, మిషెల్ మండేలాకు అభినందనలు తెలియజేస్తున్నామని ఆయనో ప్రకటనలో వెల్లడించారు. అలాగే, నెల్సన్ మండేలా ఇంటర్నేషనల్ డే ఐదో వార్షికోత్సవాన్ని చేసుకుంటున్న దక్షిణాఫ్రికా ప్రజలు, ప్రభుత్వానికి కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మండేలా గౌరవార్థం 2009లో ఆయన పుట్టిన రోజును ఐక్యరాజ్యసమితి నెల్సన్ మండేలా డేగా ప్రకటించింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...