Sunday, July 14, 2013

బోఫోర్స్ కేసులో ఆఖరి నిందితుడూ పోయాడు...

రోమ్ , జులై 14:  ఇటాలియన్ ఆయుధ దళారి,    బోఫోర్స్ కుంభకోణం కేసులో కీలక పాత్రధారి అయిన ఇటలీవ్యాపారి ఒట్టోవియో ఖత్రోకీ గుండెపోటుతో మిలాన్‌లో మృతి చెందాడు. ఆయన వయస్సు 74 ఏళ్లు.  మూడు దశాబ్దాల క్రితం మన దేశ రాజకీయాలను బోఫోర్స్ శతఘ్నుల కొనుగోళ్ల వ్యవహారం ఓ కుదుపు కుదిపింది. అప్పుడు ఖత్రోకీ పేరు బాగా వినిపించింది. 1993 వరకు భారత్‌లోనే ఉన్న ఖత్రోకీ తనపై అరెస్టు వారంట్ నమోదు కావడంతో దేశం వదిలి పారిపోయారు. ఇంటర్ పోల్ సంస్థ ఆయనపై రెడ్‌కార్నర్ నోటీస్ సైతం జారీ చేసింది. అయి నా  ఆయన ఏ ఒక్కనాడూ భారత్‌కు రావడం గానీ, కోర్టు విచారణను ఎదుర్కోవడం గానీ చేయలేదు. ఈ క్రమంలో సిబిఐ 1999లో ఆయనపై ప్రధాన అభియోగ పత్రం నమోదు చేసింది. ఆయనను మనదేశానికి తీసుకురావడానికి సిబిఐ అధికారులు రెండుసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. 2003లో మలేషియాలో, 2007లో అర్జెంటీనాలో దొరికినట్టే దొరికి తప్పించుకుపోయారు. రెండు దశాబ్దాలకు పైగా దర్యాప్తు చేసినా ఖత్రోకీకి వ్యతిరేకంగా ఒక్క ఆధారమూ దొరకలేదంటూ 2009లో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు 2011 మే 4వ తేదీన ఢిల్లీ హైకోర్టు ఖత్రోకీపై అభియోగాలను రద్దు చేసింది. దీంతో ఒక్కరికి కూడా శిక్ష పడకుండానే బోఫోర్స్ కేసు ముగిసిపోయింది. ఇప్పుడు ఖత్రోకీ మరణంతో బోఫోర్స్ కేసులో ఆరోపణలు, అభియోగాలు ఎదుర్కొన్న అందరూ దాదాపుగా మరణించినట్టే. బోఫోర్స్ మరక అంటిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991లో హత్యకు గురి కాగా, బోఫోర్స్ సంస్థ అధినేత మార్టిన్ ఒర్డబో, ఏజెంట్ విన్ చద్దా, మాజీ రక్షణ కార్యదర్శి ఎస్‌కే భట్నాగర్‌లు కేసు విచారణ క్రమంలోనే మరణించారు. ఇక మిగిలింది హిందూజా సోదరులు. వారిని 2000లో కోర్టు నిర్దోషులుగా ప్రకటించి వదిలేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...