Saturday, July 13, 2013

మోడీ ' హిందూ రూపం...

న్యూఢిల్లీ,జులై 13: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తనను తాను హిందూ జాతీయవాదిగా అభివర్ణించుకున్నారు. తాను హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను వేర్వేరుగా చూడనని, అందర్నీ భారతీయులుగానే భావిస్తానని చెప్పారు. అదే సమయంలో గుజరాత్‌లో 2002 సంవత్సరంలో అల్లర్లు చెలరేగినప్పుడు తాను తీసుకున్న నిర్ణయాలు ముమ్మాటికీ కరెక్టేనని ఆయన రాయ్‌టర్స్ వార్తా సంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉద్ఘాటించారు. భారత్‌కు లౌకికవాద నాయకుడు ఉండాలని విశ్వసిస్తారా అని అడగ్గా.. ‘‘మేం కచ్చితంగా దాన్ని విశ్వసిస్తాం. అయితే లౌకికవాదం అంటే అర్థం ఏమిటి? నా వరకు అయితే ముందు భారత్.. తర్వాతే ఏదైనా.. ఇదే నా లౌకికవాదం. అందరికీ న్యాయం చేయడం, ఎవరినీ బుజ్జగించకపోవడమే నా పార్టీ తత్వం’’ అని  మోడీ చెప్పారు. మైనారిటీ ఓటర్లను ఎలా ఆకట్టుకుంటారని ప్రశ్నించగా మోడీ స్పందిస్తూ.. ఓటర్లందరినీ భారతీయులుగానే చూస్తానన్నారు. ‘‘హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా.. అందరూ భారత దేశ పౌరులే. అందువల్ల వారిని వేర్వేరుగా భావించను. అలా చూస్తే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం. ప్రజాస్వామ్య ప్రక్రియలో మతం ఓ పనిముట్టు కాకూడదు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, దేశ నాయకత్వ పగ్గాలు హిందుత్వ నాయకుడి చేతిలోనే ఉండాలని తాము విశ్వసిస్తామని శివసేన తెలిపింది. తాను హిందుత్వ జాతీయవాదినంటూ మోడీ చేసిన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించింది. ‘‘హిందుత్వవాదులు ఏ మతానికీ వ్యతిరేకం కాదు’’ అని శివసేన పేర్కొంది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...