Wednesday, July 17, 2013

12 రంగాలలో ఎఫ్.డి.ఐ. పరిమితులు పెంపు...

న్యూఢిల్లీ, జులై 17:  భీమా, రక్షణ రంగాలతో పాటు పన్నెండు రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) పరిమితులను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ అధ్యక్షతన జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం-టెలికంలో ఎఫ్‌డీఐలను 100 శాతం పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.   మయారాం కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు. 20 రంగాల్లో పెట్టుబడుల పరిమితులను సడలించాలంటూ కమిటీ సిఫార్సు చేసినప్పటికీ.. 12 రంగాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మల్టి బ్రాండ్ రిటైల్, పౌర విమానయానం తదితర రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచిన పది నెలల తర్వాత ఈ రెండో విడత సంస్కరణలను ప్రభుత్వం చేపట్టింది. వివాదాస్పదమైన బీమా రంగంలో ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ పద్ధతిలో 26 శాతం నుంచి 49 శాతానికి పెంచారు. దీని వల్ల ఇన్వెస్ట్ చేసే కంపెనీలు ప్రభుత్వం నుంచి ముందస్తుగా అనుమతి తీసుకోనక్కర్లేదు. ఈ రంగంలో ఎఫ్‌డీఐ పరిమితులను పెంచే బిల్లు ప్రస్తుతం రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. మరోవైపు, సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐల విధానంలో సవరణలు చేశారు. వీటి ప్రకారం ఈ రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ ద్వారా అనుమతిస్తారు. అంతకు మించితే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపీబీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, కమోడిటీ ఎక్స్చేంజీలు, పవర్ ఎక్స్చేంజీలు, స్టాక్ ఎక్స్చేంజీలు, క్లియరింగ్ కార్పొరేషన్లలో ఆటోమేటిక్ పద్ధతిలో 49 శాతం దాకా ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. ప్రస్తుతం ఇందుకు ఎఫ్‌ఐపీబీ అనుమతి కావాల్సి ఉంటోంది. ఇక టెలికం రంగానికి సంబంధించి .. బేసిక్, సెల్యులార్ సర్వీసుల్లో ఎఫ్‌డీఐ పరిమితులను ప్రస్తుతమున్న 74 శాతం నుంచి 100 శాతానికి పెంచారు. ఇందులో 49 శాతం పెట్టుబడులను ఆటోమేటిక్ పద్ధతి ద్వారాను, మిగతాది ఎఫ్‌ఐపీబీ అనుమతుల ద్వారాను అనుమతిస్తారు. అటు కొరియర్ సర్వీసుల్లో 100 శాతం పెట్టుబడులను ఎఫ్‌ఐపీబీ మార్గం ద్వారా కాకుండా ఆటోమేటిక్ పద్ధతిలో అనుమతించనున్నారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సంస్థల్లో ఆటోమేటిక్ పద్ధతిన 74 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతిస్తారు. కాగా, పౌర విమానయానంలో పరిమితిని యథాతథంగా 49% వద్దే ఉంచారు. రక్షణ ఉత్పత్తుల విభాగంలో 26% పరిమితిని కొనసాగించేందుకు నిర్ణయించారు. ఇంతకుమించిన పెట్టుబడులను సీసీఎస్‌కు సంబంధించిన అత్యున్నత సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పరిగణిస్తారు. సింగిల్ బ్రాండ్ రిటైల్‌లో 100% ఎఫ్‌డీఐలకు ఓకే. 49% పెట్టుబడులకు ఆటోమేటిక్ రూట్‌కాగా, ఆపై ఎఫ్‌ఐపీబీ అనుమతించాలి.  పవర్ ఎక్స్ఛేంజీలలో 49% వరకూ పెట్టుబడులకు ఆటోమేటిక్ మార్గంలో అనుమతిస్తారు. ఇంతక్రితం ఎఫ్‌ఐపీబీ అనుమతించాల్సి ఉండేది. ఆస్తుల పునర్‌నిర్వచన (అసెట్ రీకన్‌స్ట్రక్షన్) కంపెనీలలో విదేశీ పెట్టుబడుల పరిమితి 74% నుంచి 100%కు పెంపు. దీనిలో 49% వరకూ ఆటోమాటిక్ రూట్‌లో అనుమతిస్తారు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలలో ఎఫ్‌డీఐ పరిమితిని 49% నుంచి 74%కు పెంచారు. స్టాక్ ఎక్స్ఛేంజీలు, డిపాజిటరీలలో 49% వరకూ ఎఫ్‌డీఐలను ఆటోమేటిక్ రూట్‌లో అనుమతిస్తారు. కొరియర్ సర్వీసుల విభాగంలో ఆటోమేటిక్ మార్గం ద్వారా 100% ఎఫ్‌డీఐలను అనుమతిస్తారు. టీ తోటల విభాగంలో 49% వరకూ పెట్టుబడులను ఆటోమాటిక్ రూట్‌లో అనుమతిస్తారు. ఆపై 100% వ రకూ పెట్టుబడులకు ఎఫ్‌ఐపీబీ అనుమతి తప్పనిసరి. విమానాశ్రయాలు, మీడియా, ఫార్మా యూనిట్ల కొనుగోలు(బ్రౌన్ ఫీల్డ్ ఫార్మా), మల్టీబ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐల పరిమితిపై నిర్ణయాలు తీసుకోలేదు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...