Monday, November 12, 2012

మజ్లిస్ కు మండింది...

రాష్ట్ర, కేంద్ర సర్కార్లతో కటీఫ్...

హైదరాబాద్, నవంబర్ 12: రాష్ట్రంలో  కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ  నిర్ణయాలకు వ్యతిరేకంగా  మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ఎంఐఎం ప్రకటించింది.  సంఘ్ పరివార్ కార్యక్రమాలకు ఊతమిస్తున్న ప్రభుత్వానికి ఏ పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేది లేదని  పార్టీ చీఫ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు. మద్దతు ఉపసంహరణపై గవర్నర్ కు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే యూపీఏకు మద్దతు ఉపసంహరణ పై   రాష్ట్రపతిని కలుస్తామని ఆయన తెలిపారు.ముస్లింల విషయంలో సీఎం కిరణ్ మరో పీవీ నర్సింహరావులా వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. సంఘ్ పరివార్ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న మతతత్వ విధానాలకు నిరసనగా మద్దతు ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఒవైసీ తెలిపారు. పోలీసు బలగాలతో తమను అడ్డుకోలేని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని ఓవైసీ తెలిపారు. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మద్దతు ఉపసంహరణపై వెనక్కి తగ్గిది లేదని ఒవైసీ మరోసారి స్పష్టం చేశారు.మతతత్వవాదులకు దూరంగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే తాము 1998 నుండి కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తున్నామని 2004లో కాంగ్రెసు అధికారంలోకి రావడంలో మజ్లిస్‌దే కీలక పాత్ర అన్నారు.అయితే గత కొన్ని సంవత్సరాలుగా ముస్లింలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొణిజేటి రోశయ్య హయాంలో హనుమాన్ జయంతి సందర్భంగా జరిగిన అల్లర్లలో ముస్లింలు నష్టపోయారన్నారు. ఆదోనిలో జరిగిన అల్లర్లలో ముస్లింలకు చెందిన దుకాణాలను తగులపెట్టారన్నారు. సంగారెడ్డిలో అల్లర్లకు పాల్పడిన వారిని అరెస్టు చేయలేదన్నారు. అల్లర్లకు పాల్పడిన వారికి ఎమ్మెల్యే మద్దతిస్తున్నారని విమర్శించారు.గత మూడేళ్లలో సంగారెడ్డి, సిద్దిపేట, ఆదోనీలలో ముస్లింలపై దాడులు జరిగాయన్నారు. మాదన్నపేటలో జరిగిన అల్లర్లకు సంఘ్ పరివార్ కారణమని ఆరోపించారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై తమ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నివేదించారని, ఆయన నుండి ఎలాంటి స్పందన రాలేదన్నారు. పాతబస్తీలో సబ్జి మండీని ఐదు రోజుల పాటు మూసేయించారని విమర్శించారు. ఈ ప్రభుత్వం పాతబస్తీని కర్ఫ్యూ పరిస్థితుల్లోకి నెట్టేసిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గతంలో తన స్నేహితుడు అని, జగన్ ఇప్పుడు తన స్నేహితుడు అని అసదుద్దీన్ అన్నారు.





 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...