Tuesday, October 28, 2014

మహారాష్ట్రలో బిజెపి కి శివసేన మద్దతు...సి.ఎం. గా ఫడ్నవిస్

ముంబై, అక్టోబర్ 28; . మహారాష్ట్ర భాజపా శాసనసభా పక్షనేతగా అందరూ వూహించిన విధంగానే ఆ రాష్ట్ర భాజపా శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మహారాష్ట్ర అసెంబ్లీలో అధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా భాజపా అవతరించడంతో పాటు శివసేన కూడా మద్దతు ఇవ్వనుండటంతో ఆయన సీఎం పదవి చేపట్టనున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ కేంద్ర కార్యాలయం వున్న నాగ్‌పూర్‌లోని అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ఎన్నికయ్యారు. మోదీకి అత్యంత సన్నిహితుడు కావడంతో పాటు సంఘ్‌ ఆశీస్సులు కూడా వుండటంతో సీఎం పదవి ఆయనకు దక్కింది.  తాజా ఎన్నికల్లో విదర్భ నుంచి ఎక్కువ స్థానాలు సాధించడంతో పాటు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ తాను సీఎం రేసులో లేనని ప్రకటించడంతో ఫడ్నవిస్‌కు సీఎం పీఠం దక్కేందుకు సానుకూల మార్గం ఏర్పడింది. 
22 జులై 1970లో దశాస్థ బ్రాహ్మణ మధ్య తరగతి కుటుంబంలో దేవేంద్ర ఫడ్నవిస్‌ జన్మించారు. తండ్రి  గంగాధర ఫడ్నవిస్‌ జనసంఘ్‌లో అనంతరం భాజపాలో క్రియాశీలక బాధ్యతలు నిర్వహించారు. ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. సంఘ్‌తో ఆయన కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. గంగాధర మరణాంతరం దేవేంద్ర ఫడ్నవిస్‌ రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో 21 ఏళ్ల వయసులోనే నాగ్‌పూర్‌ కార్పోరేషన్‌కు ఎన్నికయ్యారు. అనంతరం ఆయన క్రమక్రమంగా ఎదిగి సీఎం పీఠం వరకు చేరుకోనున్నారు.ఫడ్నవిస్‌కు మృదుభాషిగా పేరుంది. ఏటా కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తరువాత ఆయన నాగ్‌పూర్‌ పార్క్‌ వద్ద బడ్జెట్‌పై విశ్లేషణ ఇస్తారు. ఈ కార్యక్రమానికి మంచి పేరుంది. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...