Friday, October 17, 2014

జయకు షరతులతో సుప్రీం బెయిల్

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 17 : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జయలలితకు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. జయలలితతో పాటు మరో ముగ్గురు నిందితులు శశికళ, నటరాజన్‌, ఇలవరసికి ధర్మాసనం బెయిల్‌ మంజూరు చేసింది. 
 
శుక్రవారం ఉదయం జయలలిత బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి హెచ్‌ఎల్‌ దత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందు సుమారు గంటకు పైగా బెయిల్‌పై విచారణ సాగింది. జయలలిత తరపున ప్రముఖ న్యాయవాది బాలి నారీమన్‌ వాదనలు వినిపించారు. 
 
జయలలిత తనకు బెయిల్‌ ఇవ్వటానికి నాలుగు ప్రధాన కారణాలను కోర్టు ముందు ఉంచారు. సీనియర్‌ సిటీజన్‌, అనారోగ్యం, మాజీ ముఖ్యమంత్రి, మహిళ అన్న కోణంలో ఆలోచించి తనకు బెయిల్‌ మంజూరు చేయాల్సిందిగా సుప్రీం కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జయలలితకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. 
 
అక్రమార్జన కేసులో గత నెల 27వ తేదీన కర్నాటకలోని పరపర అగ్రహారంలో ఉన్న ప్రత్యేక కోర్టు జయలలిత సహా నలుగురికి నాలుగేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. తీర్పుపై కర్నాటక హైకోర్టు అప్పీలు చేసినప్పటకీ మెరిట్స్‌ను చూడకుండా బెయిల్‌ మంజూరు చేయకపోవడంతో జయలలిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 జయలలితకు  బెయిల్‌ మంజూరు చేయడంతో తమిళనాడులో సంబరాలు మిన్నంటాయి. చెన్నైలో అన్నాడిఎంకే కార్యకర్తలు, ఆమె అభిమానులు బాణాసంచా కాలుస్తూ, డాన్సులు చేస్తూ.. సంబరాలు జరుపుకుంటున్నారు. సుప్రీం కోర్టు ప్రాంగణంలోనూ అదే పరిస్థితి నెలకొంది. అమ్మకు జై అంటూ పెద్ద పెట్టున న్యాయవాదులు, ఆమె అభిమానులు నినాదాలు చేశారు 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...