Wednesday, October 15, 2014

అంచనాకు అందని నష్టం...రెండు రోజుల్లోకేంద్ర బ్రందం

, అక్టోబర్‌ 15 : హుద్‌హుద్‌ తుఫాన్‌ నష్టం అంచనాలకు అందకుండా ఉన్నదని, అది అరవై వేల కోట్లా? డెబ్బై వేల కోట్లా...అంతకన్నా ఎక్కువా అన్నది త్వరలోనే ఒక అంచనాకు వస్తామని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు అన్నారు. తుఫాన్‌ నష్టాన్ని అంచనా వేసేందుకు ఇప్పటికే ఎన్యూమరేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చెప్పారు. ఇందుకోసం ఇతర జిల్లాలకు చెందిన ఉద్యోగులను కూడా రంగంలోకి దించనున్నట్టు తెలిపారు. ఇది పూర్తయిన తర్వాతే నష్టాలపై అంచనా వేయగలమని సీఎం చెప్పారు.  విశాఖలో అన్ని రంగాలకు భారీ నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి చెప్పారు. విశాఖతోపాటు ఇతర జిల్లాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు ఒకటి, రెండు రోజుల్లో కేంద్ర బృందం రానున్నట్టు తెలిపారు. విశాఖలో తుఫాన్‌ సృష్టించిన విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఎదురైతే వాటిని అధిగమించేందుకు వీలుగా బ్లూ బుక్‌ను తెస్తామన్నారు. . ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి తాగునీటి సమస్య, పెట్రోల్‌, డీజిల్‌ కొరతను కొంతవరకు పరిష్కరించామని ఆయన తెలిపారు. అదేమాదిరిగా గాజువాకలో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్‌ సరఫరా పునరుద్ధరించామని ఆయన చెప్పారు. విద్యుత్‌ వ్యవస్థ అంచనాలకు అందనంత విధ్వంసానికి లోనైందని ఆయన చెప్పారు. సుమారు 40 వేలకుపైగా స్తంభాలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. ఈ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన చెప్పారు. వీలైనంత త్వరగా విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు. 

తుఫాన్‌ బారినపడ్డ తొమ్మిది లక్షల కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించామని సీఎం చెప్పారు. ప్రతి కుటుంబానికి 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్‌, కిలో చక్కెర, మూడు కిలోల కంది పప్పు, బంగాళాదుంపలు, కిలో పామాయిల్‌, రెండు కిలోల ఉల్లి, ఆర కిలో కారం పొడిని చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. మత్స్యకార, చేనేత కార్మికులకు 50 కిలోల బియ్యం ఇస్తామన్నారు. అవసరమైతే దీనికి కరపత్రాల ద్వారా ప్రచారం కల్పించి అందరూ వినియోగించుకునేలా చూస్తామన్నారు. కూరగాయలు సుమారు నాలుగు వందల టన్నులను తెప్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. నిలువ ఉండని కూరగాయలు కిలో మూడు, నిలవ ఉండే ఉల్లి, బంగాళాదుంపలు వంటి వాటిని ఐదు రూపాయలకు విక్రయిస్తా మని ఆయన వివరించారు. చివరి బాధితుడికి సహాయం అందే వరకు జిల్లాలోనే ఉంటానని ఆయన తెలిపారు.

దేశ చరిత్రలో అతి పెద్దదైన తుఫాన్‌పై నిరంతరం సమీక్షించడమే కాకుండా సానుకూలంగా స్పందించి తక్షణ ఆర్థిక సాయాన్ని ప్రకటించిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబునాయుడు ప్రశంసించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్ని పనులున్నప్పటికీ ఈ విపత్తు సంభవించిన మూడవ రోజునే ప్రధాని ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారన్నారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...