Tuesday, October 14, 2014

విశాఖకు మోడీ భరోసా... ఆంధ్రకు వెయ్యికోట్ల తుపాను సాయం

హైదరాబాద్‌, అక్టోబర్  14: తుపాను బాధిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యలకు గాను తక్షణ సాయం కింద ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్‌కు రూ. వెయ్యికోట్లు ఆర్థికసాయం ప్రకటించారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ సాధారణ పరిస్థితులు నెలకొనేవరకూ విశాఖవాసులకు, ఏపీ ప్రభుత్వానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ. 50 వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందజేయనున్నట్లు ప్రధాని తెలిపారు. తుపాను విషయంలో ప్రాణనష్టాన్ని నివారించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నందుకు ప్రభుత్వాన్ని మోదీ ప్రశంసించారు. నష్ట తీవ్రత తగ్గించడంలో కలసి కట్టుగా పనిచేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు మంచి ఫలితాలనిచ్చాయన్నారు. రెండు ప్రభుత్వాల సమన్వయం వల్లే ఇది సాధ్యమైందన్నారు. నష్టనివారణకు నేవీ, కోస్ట్‌గార్డ్‌, ఆర్మీ కృషిచేశాయన్నారు. క్లిష్టపరిస్థితుల్లో ప్రజలు ప్రభుత్వానికి సహకరించారని ప్రధాని ప్రశంసించారు. తుపాను వల్ల చేతికి వచ్చిన పంటలు తీవ్రంగా నష్టపోయాయన్న ప్రధాని బీమా కంపెనీలతో తాను మాట్లాడతానన్నారు. విశాఖను స్మార్ట్‌ సిటీగా చేస్తానని అమెరికాలోనూ చెప్పానని, అలాంటిది వూహకందని రీతిలో ఈ ఉపద్రవం సంభవించిందని ఆయన పేర్కొన్నారు. అంతమాత్రాన నిరుత్సాహపడనక్కరలేదని, త్వరలోనే పరిస్థితులు సాధారణస్థితికి చేరుకుంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తంచేశారు.మధ్యాహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్న ప్రధాని నరేంద్రమోదీ ముందుగా తుపానుకు తీవ్రంగా దెబ్బతిన్న విశాఖ విమానాశ్రయాన్ని పరిశీలించారు. తర్వాత  సి. ఎం. చంద్రబాబుతో కలసి నగరంలో తుపాను ప్రభావిత ప్రాంతాల ను. ఫరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వ సాయం...
హుదుద్‌ తుపాను ధాటికి అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ ప్రభుత్వం చేయూతనందిస్తోంది. రూ. 18 కోట్ల విలువైన విద్యుత్‌ సామగ్రిని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకి పంపింది. 530 ట్రాన్స్‌ఫార్మర్లు, 28,500 స్తంభాలు, 900 కి.మీ. వైర్లు పంపినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 
విద్యుత్ పునరుద్ధరణ చర్యలు వేగవంతం 
 తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఐదు ప్రత్యేక బృందాలతో పునరావాస చర్యలు వేగంవంతం చేశారు. ఉత్తరాంధ్రలో విద్యుత్‌ పునరుద్దరణకు చర్యలు చేపట్టారు. 100 మంది ఇంజనీర్లు, 500 మంది విద్యుత్‌ సిబ్బందితో విద్యుత్‌ పునరుద్దరణకు కృషి చేస్తున్నారు. ఒక్క నేవీకే రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లగా, విశాఖ ఉక్కుకు రూ. 340 కోట్లు, విశాఖ విమానాశ్రయానికి రూ. 500 కోట్ల నష్టం కలిగిందని  అంచనా. తుపాను ధాటికి మొత్తం 40వేల కరెంట్‌ స్తంభాలు నేలకూలినట్లు అధికారులు చెప్పారు.  
అరకులో తుపాన్‌ బీభత్సంతో ధ్వంసమైన కేకే లైన్‌ 
తూర్పు కోస్తా రైల్వేకు అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న కొత్తవలస-కిరండుల్ (కేకే ) లైన్‌ హుద్‌హుద్‌ తుపాన్‌ బీభత్సానికి పూర్తిగా ధ్వంసమైంది. అనేక చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. 62,72,81 కిలోమీటర్ల వద్ద భారీగా కొండరాలు జారి పడడంతో లైన్‌ను పునరుద్ధరించడానికి సుమారు నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు తెలిపాయి.  కాగా, విశాఖకు రైలు సర్వీసులను పునరుద్ధరిస్తున్నారు. సికింద్రాబాద్‌- విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ యథాతథంగా నడుస్తుందని, విశాఖ, గరీబ్‌రథ్‌ రైళ్లు మినహా మిగతా సర్వీసులు యథాతథంగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 


No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...