Monday, October 13, 2014

తెప్పరిల్లుతున్న ఉత్తరాంధ్ర ....రేపు విశాఖకు ప్రధాని

విశాఖ, అక్టోబర్‌ 13 : హుద్‌హుద్‌ తుపాన్‌ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం ప్రకటించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా గాయపడినవారికి లక్ష రూపాయలు, స్వల్పంగా గాయపడినవారికి రూ. 50 వేలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. వంట పాత్రలు, బట్టల కోసం రూ. 2 వేలు, బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, లీటర్‌ పామాయిల్‌, అర కేజి కారం, కేజీ చక్కెర, 3 కేజీలు ఆలుగడ్డలు ఈ సాయంత్రమే అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే మత్స్యకారుల వలకు రూ. 5వేలు, బోటుకు రూ. 10 వేలు చొప్పన నష్ట పరిహారాన్ని చంద్రబాబు ప్రకటించారు. 

అలాగే దెబ్బతిన్న వరి, ఇతర పంటలకు రూ. 10 వేలు నష్టపరిహారాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పూర్తిగా దెబ్బతిన్న పక్కా ఇళ్లకు రూ. 50 వేలు, గుడిసెలకు రూ. 25 వేలు సాయం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. నేలకొరిగిన పైర్లను కాపాడేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, మొత్తం నష్టాన్ని అంచనా వేస్తామని ఆయన చెప్పారు. విశాఖ జిల్లాలో వరద బాధితులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తుపాన్‌ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

ఇలావుండగా, 
హుద్‌ హుద్‌ తుపాన్‌ ప్రభావంతో విశాఖలో గత మూడు రోజులుగా ఆగిపోయిన సిటి బస్సులను సోమవారం సాయంత్రం నుంచి పునరుద్ధరించారు. హైదరాబాద్‌ నుంచి విశాఖకు మూడు ఏసీ బస్సులను నడుపుతున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ ఆర్టీసీ బస్సులను పునరుద్ధరించారు.  విశాఖలో 70 సిటీ బస్సులను పునరుద్ధరించారు.  సోమవారం సాయంత్రానికి చాలా చోట్లవిద్యుత్ ను పునరుద్ధరించారు. 


రేపు ప్రధాని రాక...
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం విశాఖ సందర్శిస్తారు. 
విశాఖలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు తాను తెలుసుకుంటున్నానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కూడా ఫోన్లో మాట్లడానని చెప్పారు. విశాఖ ప్రజలకు అండగా వుండటానికి మంగళవారం నాడు తాను విశాఖను సందర్శించనున్నానని నరేంద్ర మోడీ ట్విట్టర్లో తెలిపారు. 

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...