Thursday, January 28, 2010

అందరికీ ఆత్మబంధువు గుమ్మడి

ఒక ‘మహామంత్రి తిమ్మరుసు’ మరొక ‘బలరాముడు’ ఇంకొక ‘విశ్వామిత్రుడు’ చివరిగా…’కాశినాయన’ ఇంకా…భక్తపోతన, దశరథుడు, భీష్ముడు, ధర్మరాజు, కర్ణుడు, సత్రాజిత్తు, భృగుమహర్షి…వంటి ఎన్నో అద్భుత పాత్రలకు జీవం పోసిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఉమ్మడి కుటుంబంలో పెద్దన్నగా, ఎఎన్ఆర్, ఎన్టీఆర్ వంటి ఎందరో హీరోలకు తండ్రిగా, తాతగా, చెప్పులు కుట్టే సగటు మనిషిగా, సాఫ్ట్ విలన్ గా, నిరుపేదగా…వాచకం-అభినయం సమపాళ్లలో రంగరించి ఆరు దశాబ్దాల నట జీవితంలో సుమారు 500 చిత్రాల్లో నటించిన సమున్నత కళాకారుడు గుమ్మడి.గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని కొల్లూరు మండలం రావికంపాడులో 1927 జూలై 9న జన్మించిన గుమ్మడి వెంకటేశ్వరరావు ఎస్.ఎస్.ఎల్.సి. వరకూ చదివారు. విద్యార్థి దశలో కమ్యూనిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. 1942లో తొలిసారిగా ఒక నాటకం కోసం ముఖానికి రంగు వేసుకున్నారు. అందులో ఆయన వృద్ధుడుగా నటించారు. కాలక్రమంలో సినీ నటుడు అయినా తన సమకాలికులైన ఎన్టీఆర్, ఎ.ఎన్.ఆర్.లకు తండ్రిగా, మామగా నటించిన సందర్భాలు ఎన్నో. గుమ్మడి తొలుత కథానాయకుడుగా 1950లో ‘అదృష్ట దీపుడు’ అనే చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆయన కథానాయకుడుగా నటించిన ‘జై వీర భేతాళ’ కారణాంతరాల వల్ల విడుదలకు నోచుకోలేదు. అనంతరం ఎన్టీఆర్ సొంత సినిమా ‘తోడు దొంగలు’లో ఆయనతో సమానమైన పాత్ర పోషించారు. చిన్నవయసులోనే క్యారెక్టర్ నటుడుగా మారారు. ‘అల్లూరు సీతారామరాజు’ చిత్రంలో మల్లుదొర, ‘మాయాబజార్’లో బలరాముడు పాత్రలు మరిచిపోలేం. గుమ్మడి అంటే వెంటనే గుర్తుకు వచ్చే పాత్ర ‘మహామంత్రి తిమ్మరసు’ సినిమాలోని తిమ్మరసు పాత్రే. ఎంతో గంభీరంగా ఆయన ఆ పాత్ర పోషించారు. తిమ్మరసు చిత్రానికి ఆయన జాతీయ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం అందుకున్నారు.పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘిక చిత్రాలన్నింటిలోనూ ఆయన పోషించని పాత్ర లేదు. ఎస్వీ రంగారావుకు సమఉజ్జీగా నిలిచి ఆయన తోనే అభినందలు అందుకున్న విశిష్ట కళాకారుడు గుమ్మడి. ‘కులదైవం’, ‘మా ఇంటి మహాలక్ష్మి’, ‘కులగోత్రాలు’, ‘జ్యోతి’, ‘రాజమకుటం’, ‘సతీ తులసి’, ‘భక్త పోతన’, ‘మిస్సమ్మ’, ‘రాణి రత్నప్రభ’, ‘నమ్మిన బంటు’, ‘జయభేరి’, ‘హరిశ్చంద్ర’, ‘దీపావళి’ వంటి ఎన్నో చిత్రాలు ఆయనను ప్రేక్షకులకు ఎంతో దగ్గర చేశాయి. నటుడికి వాచకం ప్రధాన ఆర్హత అని నమ్మే గుమ్మడి ‘ఆయనకు ఇద్దరు’ చిత్రం సమయంలో వయోభారం కారణంగా ఆరోగ్యం దెబ్బతినడంతో సరిగా మాట్లాడలేకపోయారు. దీంతో ఆయన పాత్రకు నూతన ప్రసాద్ చేత డబ్బింగ్ చెప్పించారు. ఆ తర్వాత గుమ్మడి నటించడం ఆపేశారు. ఆ తర్వాత తన వయసుకు తగ్గట్టుగా ఉంటుందని, స్వరానికి కూడా సరిపోతుందని చెప్పడంతో ‘శ్రీ కాశినాయన చరిత్ర’లో చివరిసారిగా గుమ్మడి నటించారు. ఆ చిత్రం ఇంకా విడుదల కావలసి ఉంది. గుమ్మడిని 1989లో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం ‘కళాప్రపూర్ణ’తో సత్కరించగా, రాష్ట్ర ప్రభుత్వం సమున్నతమైన ‘రఘుపతి వెంకయ్య’ అవార్డును అందజేసింది. గుమ్మడి తన జీవన స్మృతులను ‘తీపి గుర్తులు…చేదు జ్ఞాపకాలు’ పేరుతో అక్షరీకరించారు. రంగుల్లో రూపొందిన క్లాసిక్ ‘మాయాబజార్’ చిత్రాన్ని గుమ్మడి ఇటీవల ప్రత్యేకంగా తిలకించారు. ఈనెల 30న ఈ చిత్రం అఖిలాంధ్ర ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలోనే ఆయన కన్నుమూశారు. ఆయన ఈరోజు మననధ్య లేకపోయినా ఆయన పోషించిన పాత్రలు సినీ ప్రేక్షక హృదయాలలో చిరస్థాయిగా నిలచి పోతాయి.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...