Thursday, January 21, 2010

ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నమ్మకం తగ్గుతోంది:రోశయ్య


హైదరాబాద్,జనవరి 21: అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, నాణ్యతను పెంచడం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన ఆవశ్యకత కలెక్టర్లపై ఉందని ముఖ్యమంత్రి రోశయ్య ఉద్బోధించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం పనితీరుపై ప్రజలకు నమ్మకం తగ్గిందని ఆయన అన్నారు. జూబ్లీహాల్ లో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల రెండో రోజు సమావేశంలో ఆయన ఒక్కొక్కరితో ముఖాముఖీ భేటీ అయ్యారు. రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్ల సమావేశం గురువారం ముగిసింది. అనంతరం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సమావేశం వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలులో వేగం, నాణ్యతలో పెరిగిన మార్పు ప్రజలకు స్పష్టంగా తెలిసేలా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని ఆయన ఆదేశించారు. అభివృద్ధి అంటే నిరుపేదలకు కేవలం భూమిని పంచిపెట్టినంత మాత్రాన రాబోదన్నారు. పంచిపెట్టిన భూమి నుంచి మంచి ఫలాలు రావాలని, ఆ ఫలాలు అవసరమైన ప్రజలకు చేరినప్పుడే అభివృద్ధి మాటకు అర్థం అన్నారు. రెవెన్యూ వసూళ్ళపై దృష్టి సారించాలని కలెక్టర్లను ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించారు. ప్రభుత్వ ఆదాయం పెరిగితేనే సంక్షేమ పథకాల అమలు వీలవుతుందన్నారు. నకిలీల వల్ల రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్థమైనదన్న భావన ప్రజల్లోకి వెళ్ళిందన్నారు. అన్ని జిల్లా జాయింట్ కలెక్టర్లతో త్వరలోనే రెండు రోజుల సమావేశం ఏర్పాటు చేస్తానని రోశయ్య తెలిపారు. ఇక నుంచి ప్రతి శనివారమూ జిల్లాల పర్యటన చేస్తానని ఆయన అన్నారు. పరిపాలన విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులకూ లొంగకుండా కలెక్టర్లు పనిచేయాలని రోశయ్య సూచించారు. అలాగే పరిపాలనకు సంబంధించి కలెక్టర్లపై ఎలాంటి ఒత్తిడులూ చేయవద్దని మంత్రులను కూడా సిఎం ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు అందించే విషయంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడులు ఎదురైనా తనతో నేరుగా సంప్రతించాలని కలెక్టర్లకు రోశయ్య తెలిపారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఉందని ధర్మాన అన్నారు. ఐటి పరిశ్రమను జిల్లాల్లో కూడా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ పథకం కింద పేద లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోతే వాటిని ప్రభుత్వమే అందజేస్తుందని ధర్మాన వెల్లడించారు.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...