Wednesday, January 27, 2010

గుమ్మడి ఇకలేరు

హైదరాబాడ్,జనవరి 27: ప్రముఖ సినీ నటుడు గుమ్మడి వేంకటేశ్వరరావు(83) కన్నుమూశారు. మూత్రపిండ సమస్యలతో ఆదివారం కేర్‌ ఆసుపత్రిలో చేరిన ఆయన ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. రాత్రి 11.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా రావికంపాడులో 1927లో జన్మించిన గుమ్మడి దాదాపు 500లకు పైగా చిత్రాలలో నటించారు. ఆరు దశాబ్దాలపాటు చిత్రరంగంలో హీరోగా, విలన్‌గా, కారెక్టర్‌ ఆర్టిస్టుగా అనేక పాత్రలకు జీవం పోసిన ఆయన కళారంగానికి ఎనలేని సేవలందించారు. 1950లో ఆదృష్టదీపుడు అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయమయిన గుమ్మడి, ఆ తర్వాత ఎలాంటి భేషజాలకు పోకుండా అన్ని రకాల పాత్రలకు సై అన్నారు. దశరథుడి పాత్ర ఆయనకు అతికినట్లు సరిపోయేదని చిత్ర ప్రముఖులు ఎన్నోసార్లు పేర్కొన్నారు. మహామంత్రి తిమ్మరుసు చిత్రానికి గాను రాష్టప్రతి రజతపతకం అందుకున్న గుమ్మడి, మరోమలుపు చిత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమనటుడిగా, 1999లో రఘుపతి వెంకయ్య అవార్డును పొందడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా పొందారు.
గుమ్మడి వేంకటేశ్వరరావు అంత్యక్రియలు గురువారం పంజగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. అమెరికా నుండి కుమారుడు, కూతురు, ఇంకా కొంతమంది బంధువులు రావాల్సిఉన్నందున తుది కార్యక్రమం గురువారం నిర్వహించడానికి నిర్ణయించినట్లు తెలిసింది. గుమ్మడి మరణం పట్ల చిత్ర పరిశ్రమ ప్రగాధ సంతాపం వ్యక్తం చేసింది.

No comments:

బాచుపల్లి నాలా లో బాలుని మృతి

  హైదరాబాద్ , సెప్టెంబర్ 5: భారీ వర్షాల వల్ల హైదరాబాద్ లోని  బాచుపల్లి లో నాలాలో కొట్టుకుపోయిన  బాలుడు మిథున్‌ (4) మృతి చెందాడు. ప్రగతినగర్‌...